కొచర్‌కు క్లీన్‌చిట్‌ చెల్లదన్న ఐసీఐసీఐ బ్యాంకు

24 Oct, 2018 01:01 IST|Sakshi

నివేదికను వెనక్కి తీసుకున్న అమర్‌చంద్‌ మంగళ్‌దాస్‌

న్యూఢిల్లీ: వీడియోకాన్‌ గ్రూపునకు రుణం జారీ వెనుక ప్రయోజనం పొందారన్న ఆరోపణలతో విచారణ ఎదుర్కొంటూ, ఐసీఐసీఐ బ్యాంకు ఎండీ, సీఈవో పదవుల నుంచి తప్పుకున్న చందాకొచర్‌ విషయంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఆమెపై వచ్చిన బంధుప్రీతి ఆరోపణల్లో ఏ మాత్రం సత్యం లేదంటూ 2016 డిసెం బర్‌లో క్లీన్‌చిట్‌ ఇచ్చిన న్యాయ సేవల సంస్థ సిరిల్‌ అమర్‌చంద్‌ మంగళ్‌దాస్, తన నివేదికను ఉపసంహరించుకున్నట్టు ఐసీఐసీఐ బ్యాంకు స్టాక్‌ ఎక్సేంజ్‌లకు తెలియజేసింది.

ఈ విచారణ నివేదికను ఆధారంగా చేసుకునే ఈ ఏడాది మార్చిలో చందాకొచర్‌పై వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదని తాము క్లీన్‌చిట్‌ ఇచ్చామని... అమర్‌చంద్‌ మంగళ్‌దాస్‌ తన నివేదికను వెనక్కి తీసుకున్న నేపథ్యంలో అదిక చెల్లుబాటు కాదని బ్యాంకు స్పష్టం చేసింది. ప్రజావేగుల నుంచి వచ్చిన తాజా ఆరోపణలు, బ్యాంకుకు లభించిన అదనపు సమాచారం ఆధారంగా సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి బీఎన్‌ శ్రీకృష్ణ ఆధ్వర్యంలో విచారణ కమిటీని నియమించిన విషయం తెలిసిందే. ఈ పరిణామాలను సిరిల్‌ అమర్‌చంద్‌ మంగళ్‌దాస్‌ సంస్థకు తెలియజేయడంతో, గత తమ నివేదిక ఇక ఎంత మాత్రం చెల్లుబాటు కాదని అభిప్రాయం వ్యక్తం చేసినట్టు ఐసీఐసీఐ బ్యాంకు పేర్కొంది. 

మరిన్ని వార్తలు