రఫేల్‌ డీల్‌ : కేంద్రంపై మరో బాంబు 

13 Apr, 2019 15:07 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  దేశవ్యాప్తంగా ప్రకంపనలు పుట్టిస్తున్న రఫేల్‌  కుంభకోణంలో మరో  షాకింగ్‌ న్యూస్‌ వెలుగులోకి వచ్చింది. ఈ ఒప్పందంలో భాగంగా అనిల్‌ అంబానీకి కోట్ల రూపాయల పన్నును ఫ్రెంచ్‌ అధికారులు మాఫీ  చేశారంటూ  ఫ్రెంచి పత్రిక లీ మాండె మరో బాంబు వేసింది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన  పారిశ్రామికవేత్త అనిల్‌ అంబానీకి లబ్ది  చేకూర‍్చడం కోసమే రిలయన్స్‌ డిఫెన్స్‌ కంపెనీకి డీల్‌ను కట్టబెట్టారన్న ఆరోపణలకు తోడు, ఈ సంచలన కథనం మరింత కలకలం రేపుతోంది. దీంతో రఫేల్‌ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారంలో సుప్రీంకోర్టు తాజా ఆదేశాలతో ఇబ్బందుల్లో పడిన నరేంద్రమోదీ ప్రభుత్వానికి  ఎన్నికల వేళ లీ మాండె రూపంలో మరో  గట్టి ఎదురు దెబ్బ. 

భారత వ్యాపారవేత్త అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ అట్లాంటిక్ ఫ్లాగ్ ఫ్రాన్స్ అని పిలిచే  టెలికాం సంస్థకు అనుకూలంగా ఫ్రెంచ్ అధికారులు సుమారు  రూ.11,27 కోట్లు  (143.7 మిలియన్ యూరోలు లేదా 162.6 మిలియన్ డాలర్ల ) పన్నులను రద్దు చేసారని  అక్కడి జాతీయ వార్తాపత్రిక  లీ మాండే  నివేదించింది.  భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్‌తో రాఫెల్ ఒప్పందాన్ని ప్రకటించిన కొన్ని నెలల తరువాత ఈ పరిణామం చోటు చేసుకుందని రిపోర్ట్‌ చేసింది. 

లీ మాండే  ప్రకారం డస్సాల్ట్ ఏవియేషన్ రఫేల్‌ ఒప్పందంలో చర్చల సందర్బంగా అనిల్‌ అంబానీ పన్నుల వివాదానికి 2015, అక్టోబర్‌లో పరిష్కారం లభించిందని తెలిపింది. ఏప్రిల్, 2015  ప్రధాని మోదీ ఫ్రాన్స్‌లో అధికారిక పర్యటన సందర్బంగా 36 రఫేల్‌ ఫైటర్ జెట్ల కొనుగోలు డీల్‌ను ప్రకటించడం గమనార్హం.

2007 - 2010 మధ్య కాలంలో అంబానీ రిలయన్స్ అట్లాంటిక్ ఫ్లాగ్ ఫ్రాన్స్ కంపెనీ 60 మిలియన్ల యూరోలు పన్నుల ఎగవేతపై  అక్కడి పన్ను అధికారులు దర్యాప్తు  చేపట్టారు. అయితే 7.6 మిలియన్ యూరోలు చెల్లించేందుకు కంపెనీ ప్రతిపాదించింది. దీన్ని తిరస్కరించిన అధికారులు దర్యాప్తు చేపట్టారని, కానీ ఈ వివాదానికి 2015లో ముగింపు పలికారని లీమాండే నివేదించింది. ఈ కథనంపై అనిల్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ అధికారికంగా స్పందించాల్సి ఉంది. 

కాగా రఫేల్‌ తీర్పుపై రివ్యూ పిటిషన్లపై కేంద్ర ప్రభుత్వం లేవనెత్తిన అభ్యంతరాలను సుప్రీకోర్టు ఇటీవల తోసిపుచ్చింది. రివ్యూ పిటిషన్ల విచారణకు అంగీకరించిన సర్వోన్నత న్యాయస్థానం త్వరలో విచారణ తేదీని నిర్ణయిస్తామని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. 
 



 

మరిన్ని వార్తలు