రండి.. ఇంగ్లిష్‌ నేర్చుకుందాం! 

27 Apr, 2019 00:32 IST|Sakshi

12 భారతీయ; 16 అంతర్జాతీయ భాషల్లో నేర్చుకునే వీలు

ఎన్‌గురు యాప్‌లో 2.5 కోట్ల మంది యూజర్లు

వీరిలో నిరుద్యోగులు,  ప్రొఫెషనల్సే ఎక్కువ మంది

 ఇప్పటికే రూ.17 కోట్ల  నిధుల సమీకరణ

‘స్టార్టప్‌ డైరీ’తో ఫౌండర్‌ అర్షన్‌ వకిల్‌  

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ప్రస్తుత పోటీ ప్రపంచంలో నిలవాలన్నా, గెలవాలన్నా ఇంగ్లిష్‌ తప్పనిసరి. పట్టు లేకున్నా కనీస పరిజ్ఞానం లేకుంటే కష్టమే. అందుకే మార్కెట్లో 30 రోజుల్లో ఆంగ్లం వంటి పుస్తకాలు, స్పోకెన్‌ ఇంగ్లిష్‌ క్లాస్‌లు, ఆన్‌లైన్‌ శిక్షణ కోర్సులు వంటివెన్నో వచ్చాయి. వీటిల్లో ఏదైనా సరే ఇంగ్లిష్‌ పదాలు, ఉచ్చారణ, వ్యాఖ్య నిర్మాణం మినహా ప్రస్తుత ఉద్యోగ అవసరాలకు తగిన భాష నైపుణ్యం, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ ఉండవు. దీన్నే వ్యాపార వేదికగా ఎంచుకుంది కింగ్స్‌ లెర్నింగ్‌. ఎన్‌గురు యాప్‌ ద్వారా 12 భారతీయ, 16 అంతర్జాతీయ భాషల నుంచి ఇంగ్లిష్‌ నేర్చుకునే సేవలను అందిస్తుంది. మరిన్ని వివరాల్ని కంపెనీ ఫౌండర్‌ అర్షన్‌ వకిల్‌ ‘స్టార్టప్‌ డైరీ’తో పంచుకున్నారు. అవి ఆయన మాటల్లోనే... 

28 భాషల్లో ఇంగ్లిష్‌.. 
ప్రస్తుతం తెలుగు, మరాఠీ, హిందీ, గుజరాతీ వంటి 12 భారతీయ భాషలు, నేపాలీ, కొరియన్, అరబిక్, థాయ్, స్పానిష్‌ వంటి 16 అంతర్జాతీయ భాషల్లో ఇంగ్లిష్‌ నేర్చుకునే వీలుంది. స్పోకెన్‌ ఇంగ్లిష్‌ క్లాసుల్లాగా రోజు వారీ ఇంగ్లిష్‌ పదాల ఉచ్ఛారణ, వ్యాఖ్య నిర్మాణం వంటివే కాకుండా ప్రస్తుత ఉద్యోగ అవసరాలకు అనుగుణమైన భాష నైపుణ్యాన్ని నేర్చుకోవచ్చు. ప్రస్తుతం జనరల్‌ ఇంగ్లిష్‌ కోర్సుతో పాటూ రిటైల్, హోటల్, బీపీఓ, ఈ–మెయిల్‌ రైటింగ్, ఇంటర్వ్యూ ప్రిపరేషన్‌ ఇంగ్లిష్‌ భాష అందుబాటులో ఉన్నాయి. ఈ యాప్‌ ఇంటర్నెట్‌ లేకుండా పనిచేస్తుంది కాబట్టి యూజర్లు ఎప్పుడైనా, ఎక్కడైనా వినియోగించుకోవచ్చు. 

2.5 కోట్ల మంది యూజర్లు.. 
ప్రస్తుతం దేశవ్యాప్తంగా 2.5 కోట్ల మంది కస్టమర్లున్నారు. ఇందులో 78 శాతం యూజర్లు 34 ఏళ్ల లోపు వయస్సు ఉన్న వాళ్లే. 32 శాతం మహిళలు ఉన్నారు. తెలంగాణ నుంచి 5.75 శాతం మంది యూజర్లున్నారు. నెలకు 2 లక్షల మంది వినియోగిస్తున్నారు. బీ2సీలో ప్రీమియం కోర్సులు, లైవ్‌ క్లాస్‌లు, మాక్‌ ఇంటర్వ్యూ వంటివి ఉంటాయి. ప్రారంభ ధర రూ.149. బీ2బీలో కంపెనీ ఉద్యోగులకు ఇంగ్లిష్, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ ట్రైనింగ్‌ ప్రోగ్రామ్స్‌ ఉంటాయి. ధర రూ.1,500. ఇప్పటివరకు బీ2బీలో టీసీఎస్, ఒబెరాయ్‌ గ్రూప్, గోద్రెజ్‌ నేచర్‌ బ్యాస్కెట్‌ వంటి సంస్థల్లో 100కు పైగా శిక్షణ శిబిరాలను నిర్వహించాం. 

రూ.17 కోట్ల సమీకరణ.. 
ప్రస్తుతం మా కంపెనీలో 50 మంది ఉద్యోగులున్నారు. రూ.17 కోట్ల నిధులను సమీకరించాం. మిశెల్‌ అండ్‌ సుసన్‌ డెల్‌ ఫౌండేషన్, విలేజ్‌ క్యాపిటల్‌లు ఈ పెట్టుబడులు పెట్టాయి. ఈ ఏడాది ముగింపు నాటికి మరో విడత నిధులను సమీకరించాలని నిర్ణయించాం. ఎంత మొత్తంలో సమీకరించేది ఇన్వెస్టర్ల గురించి త్వరలోనే వివరాలు వెల్లడిస్తామని అర్షన్‌ తెలిపారు.  

మరిన్ని వార్తలు