సెలవు తీసుకుంటున్నారా...?

1 Jan, 2018 02:10 IST|Sakshi

విరామంతో పనిలో చురుకుదనం

ఏటా కొన్ని రోజుల పాటు బ్రేక్‌

అందుకు ముందు నుంచే ప్రణాళిక   

విదేశాల్లోనయితే ఉద్యోగులు ఏటా కొన్ని రోజులు సెలవు పెట్టి వెళ్లడం సర్వ సాధారణం. కంపెనీలు కూడా దీన్ని ప్రోత్సహిస్తూ ఉద్యోగులకు సెలవు కాలంలో అదనపు వేతనాలు చెల్లిస్తుంటాయి. ఆస్ట్రేలియా పత్రిక సిడ్నీ హెరాల్డ్‌లో నిబంధనల ప్రకారం ఉద్యోగులు ఏటా 40 రోజులు సెలవుపై వెళ్లడం తప్పనిసరి.

ఈ కాలంలో వారికి సాధారణ వేతనం కంటే 50 శాతం అదనంగా చెల్లిస్తారు. కానీ, మనదేశంలో పరిస్థితులు భిన్నం. నిత్య జీవితపు ఒత్తిళ్లను పక్కన పెట్టి కొన్ని రోజుల పాటు సెలవుపై వెళ్లొద్దామన్నా... సెలవు దొరకడం కష్టం. ఒకవేళ సెలవు దొరికినా... ఏదైనా టూర్‌కు వెళ్లి వద్దామనుకుంటే అందుకు సరిపడా నిధులుండవు. ఎక్కువ మందికి ఎదురయ్యేవి ఈ పరిస్థితులే.


మన దేశంలో ఉద్యోగంలో పని ఒత్తిడి కూడా ఎక్కువే. ఇక ఈ ప్రపంచంలో సెలవుల భాగ్యం నోచుకుని వారిలో భారతీయులు నాలుగో స్థానంలో ఉన్నట్టు ‘ఎక్స్‌పీడియా వెకేషన్‌ డిప్రీవియేషన్‌ రిపోర్ట్‌ 2016’ చెబుతోంది. ఇటీవలే ఎకనమిక్‌ టైమ్స్‌ నిర్వహించిన సర్వేలోనూ మూడింట రెండొంతులు తమకు తగినంత విరామందొరకడం లేదనే చెప్పారు.మన దేశంలో ముఖ్యంగా మధ్య వయసులో ఉన్న వారు ఎక్కువగా సెలవులకు దూరమవుతున్నారు.

30 ఏళ్లలోపు వారిలో ఇది 64 శాతం ఉంటే 41–50 ఏళ్ల మధ్య వయసు వారిలో ఇది 71 శాతంగా ఉంది. ఒకవేళ వీలు దొరికి సెలవు చిక్కి ఎటైనా వెళ్లినా గానీ, వారు కార్యాలయానికి సంబంధించిన మెయిల్స్‌ను తరచూ చెక్‌ చేసుకోవడంతోపాటు, తమ ఫోన్‌కు వచ్చే ఆఫీసు సంబంధిత కాల్స్‌ను రిసీవ్‌ చేసుకుని సమాధానం చెప్పాల్సి వస్తుందట. కానీ, మనస్తత్వ శాస్త్రవేతల విశ్లేషణ ప్రకారం కేవలం ఉద్యోగం, పనే కాదు!! విరామం, విశ్రాంతి కూడా అవసరమే. ఈ రెండింటినీ సమన్వయం చేసుకోవాలి. ఉద్యోగికి తగినంత విశ్రాంతి లభిస్తే పని మీద ఎక్కువ దృష్టి సారించగలరనేది వారి మాట.

ఎందుకని...?
మన దేశంలో ఉద్యోగులు ఎక్కువ రోజుల పాటు సెలవు తీసుకునే సాహసం దాదాపు చేయరు. అన్నేసి రోజులు సెలవు పెట్టి యాజమాన్యం ఆగ్రహానికి గురి కావడం ఎందుకన్న ధోరణే అందుకు కారణమన్నది నిపుణుల మాట. కొన్ని కంపెనీల్లో ఉద్యోగులు సెలవు తీసుకోవడాన్ని నిరుత్సాహపరిచే విధానాలు కూడా అమలవుతుంటాయి. అయితే, మరింత మంది యువత ఉద్యోగాల్లోకి వస్తున్న నేపథ్యంలో ఈ ధోరణి మారాల్సి ఉందని పీపుల్‌ స్ట్రాంగ్‌కు చెందిన దేవాశిష్‌ శర్మ అభిప్రాయపడ్డారు.  


ప్రాధాన్యతలు, ప్రణాళిక
సెలవు సంపాదించారనుకోండి... ఆ తర్వాత దృష్టి సారించాల్సింది ప్రణాళికపైనే. తగిన ప్రణాళిక, షెడ్యూల్‌తో సెలవులను పూర్తిగా ఆస్వాదించొచ్చంటున్నారు నిపుణులు. హైదరాబాద్‌కు చెందిన స్వాతి, కిరణ్‌ దంపతులు ఏటా ఓ పది రోజుల పాటు వెకేషన్‌కు వెళ్లడం తప్పనిసరిగా చేస్తుంటారు.

అందుకోసం వారు టికెట్లు, హోటల్‌ రూమ్‌ను చాలా ముందుగానే బుక్‌ చేసుకుంటారు. దీంతో తక్కువ చార్జీలకే బుకింగ్‌ పూర్తి చేయడం ద్వారా వారు తగినంత ఆదా చేసుకుంటున్నారు. వీరి టూర్‌ బడ్జెట్‌ రూ.60,000. దీంతో ఎక్కడికి వెళ్లాలి, ఏ మార్గంలో వెళ్లాలి. అక్కడ ఏమేం చూడాలి, స్థానికంగా విడిది, భోజనం, ప్రయాణం ఇవన్నీ కూడా కచ్చితమైన ప్రణాళిక మేరకు ప్లాన్‌ చేసుకుని బడ్జెట్‌లోపే వెకేషన్‌ పూర్తి చేస్తామని వారు తెలియజేశారు.


బడ్జెట్‌ కీలకం
ప్రయాణానికి కావాల్సింది బడ్జెటే. వాస్తవానికి మన దేశంలో ఎక్కువ మంది పొదుపరులే. కానీ ఎటైనా వెళ్లాలనుకుంటే మాత్రం డబ్బులకు కటకట కనిపిస్తుంది. 34 శాతం మంది ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారు. కారణం సెలవు పెట్టి ఎటైనా వెళ్లి రావడం అన్నది వారి దృష్టిలో ముఖ్యం కాకపోవడం ఒకటైతే, రెండోది పొదుపు చేయకపోవడం. అందుకే వెకేషన్‌కు బడ్జెట్‌ నిర్ణయించుకుని ప్రతీ నెలా కొంత మొత్తం పక్కన పెడుతూ వెళ్లడమే దీనికి పరిష్కారం.

ఇందుకోసం సిప్‌ మంచి మార్గం అంటున్నారు ఆర్థిక సలహాదారులు. బడ్జెట్‌కు అనుగుణంగా నెలకు రూ.2,000 నుంచి వీలైనంత షార్ట్‌ టర్మ్‌ డెట్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చని సూచిస్తున్నారు. ఎప్పుడు అవసరమైతే అప్పుడు వీటిని నగదుగా మార్చుకోవచ్చు. పైగా ఆటుపోట్లు లేకుండా స్థిరమైన రాబడులు ఇస్తాయి ఇవి. ఏడాది, ఆలోపు అవసరాల కోసం స్టాక్స్‌లో, ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తే రిస్క్‌ కారణంగా అసలు లక్ష్యం నెరవేరకపోవచ్చు.

గుర్తు పెట్టుకోవాల్సిన అంశం ఏమిటంటే మీ స్వల్ప కాలిక అవసరం కోసం పొదుపు చేస్తున్నారే గానీ, రాబడుల కోసం ఇన్వెస్ట్‌ చేయడం లేదు. అందుకే రిస్క్‌ సాధనాలను ఎంచుకోవడం తగదు. ఒకవేళ హాలిడే ప్లాన్‌కు మూడు, నాలుగేళ్ల సమయం ఉంటే అప్పుడు ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌ను పరిశీలించొచ్చు. ఎక్కువ వ్యవధి ఉంటుంది కనుక, రిస్క్‌ ఉన్నప్పటికీ పొదుపుతోపాటు మెరుగైన రాబడులూ అందుకోవచ్చు. 

మరిన్ని వార్తలు