ఎల్‌ఈడీ/ఓఎల్‌ఈడీ టీవీల ధరలకు రెక్కలు

26 Feb, 2018 02:13 IST|Sakshi

7% వరకు అధికమయ్యే చాన్స్‌

న్యూఢిల్లీ: ఎల్‌ఈడీ/ఓఎల్‌ఈడీ టీవీల ధరలకు రెక్కలు రానున్నాయి. మోడల్‌నుబట్టి ధర 2 నుంచి 7 శాతం వరకు అధికమయ్యే చాన్స్‌ ఉంది. పెరిగిన కస్టమ్స్‌ డ్యూటీకి అనుగుణంగా తయారీ కంపెనీలు సైతం ధరల సవరణకు దిగడమే ఇందుకు కారణం. 7.5 శాతం ఉన్న దిగుమతి పన్నును తాజా బడ్జెట్‌లో 15 శాతానికి చేర్చిన సంగతి తెలిసిందే. అలాగే ఎల్‌సీడీ, ఎల్‌ఈడీ, ఓఎల్‌ఈడీ టీవీల విడిభాగాలపై కస్టమ్స్‌ డ్యూటీని 10 శాతం నుంచి 15 శాతానికి పెంచారు.

డ్యూటీని 10 శాతానికి కుదించాల్సిందిగా కన్జూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ అప్లయెన్సెస్‌ మాన్యుఫ్యాక్చరర్స్‌ అసోసియేషన్‌ (సియామా) ప్రభుత్వాన్ని కోరింది. ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో ధరల సవరణకు దిగింది. ఎల్‌ఈడీ, ఓఎల్‌ఈడీ రంగంలో రెండేళ్లుగా పెద్దగా వృద్ధి లేదని, ధరలు పెరిగితే స్వల్పకాలంలో డిమాండ్‌ తగ్గుతుందని సియామా చెబుతోంది. ఇదే జరిగితే తయారీ కంపెనీల విస్తరణ పరిమితమవుతుందని అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ మనీష్‌ శర్మ పేర్కొన్నారు. కొత్త ఉద్యోగాల సృష్టి తగ్గుతుందన్నారు.  

ఒకదాని వెంట ఒకటి..
ధరల పెంపు ప్రభావం కస్టమర్లపై ఉంటుందని ప్యానాసోనిక్‌ చెబుతోంది. మోడళ్ల ధర 2–7 శాతం అధికం కానుందని కంపెనీ ఇండియా కన్జూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ విభాగం బిజినెస్‌ హెడ్‌ నీరజ్‌ బహల్‌ తెలిపారు. ధరల సవరణ విషయంలో సామ్‌సంగ్‌ సైతం ఇదే బాటలో నడవనుంది. ధరల పెంపు తప్పదని, ఏ మేరకు పెంచాలో అన్న అంశంపై కసరత్తు చేస్తున్నామని ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్‌ ఇండియా ఎండీ కి వాన్‌ కిమ్‌ వ్యాఖ్యానించారు.

విక్రయ ధర అధికమైతే మధ్య, దీర్ఘకాలిక ప్రభావం ఎలా ఉంటుందన్న అంశాన్ని అధ్యయనం చేస్తున్నట్టు సోనీ ఇండియా బ్రేవియా బిజినెస్‌ హెడ్‌ సచిన్‌ రాయ్‌ పేర్కొన్నారు. టీవీల విక్రయాలు గత కొన్నేళ్లుగా వృద్ధిబాటలో ఉన్నాయని, మొత్తం పరిశ్రమను చూస్తే పెంపు ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చని వ్యాఖ్యానించారు. కాగా, దేశీయంగా తయారీని పెంచడానికే దిగుమతి పన్ను పెంపు అని ప్రభుత్వం చెబుతోంది.   

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు