జెట్‌ దివాలాపై నేటి నుంచి విచారణ

20 Jun, 2019 05:17 IST|Sakshi

పార్టీలుగా చేర్చాలని ఎన్‌సీఎల్‌టీకి పైలట్లు, ఇంజినీర్ల వినతి

ముంబై: రుణ సంక్షోభంతో కుప్పకూలిన ప్రైవేట్‌ విమానయాన సంస్థ జెట్‌ ఎయిర్‌వేస్‌ దివాలాకు సంబంధించిన పిటిషన్‌పై జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) గురువారం నుంచి విచారణ జరపనుంది. తాజాగా ఇందులో తమను కూడా పార్టీలుగా చేర్చాలని జెట్‌ ఎయిర్‌వేస్‌ పైలట్లు, ఇంజినీర్ల యూనియన్లతో పాటు నెదర్లాండ్స్‌కి చెందిన రెండు లాజిస్టిక్స్‌ వెండింగ్‌ సంస్థలు కూడా ఎన్‌సీఎల్‌టీని ఆశ్రయించాయి. తాము ఇంటర్‌వెన్షన్‌ పిటిషన్‌ వేసేందుకు అనుమతించాలని వెండార్లు కోరారు.

జెట్‌ భారీగా బాకీ పడటంతో దానికి లీజుకిచ్చిన విమానాలను ఈ ఏడాది మార్చిలో అమ్‌స్టర్‌డామ్‌ ఎయిర్‌పోర్టులో ఈ రెండు సంస్థలు స్వా«ధీనం చేసుకున్నాయి. అయితే, ఈ సంస్థల పేర్లు ఇంకా వెల్లడి కాలేదు. ఏప్రిల్‌ 17 నుంచి జెట్‌ కార్యకలాపాలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. దాదాపు రూ. 8,500 కోట్ల రుణాలు రాబట్టుకునేందుకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) సారథ్యంలోని 26 బ్యాంకుల కన్సార్షియం.. జెట్‌ ఎయిర్‌వేస్‌పై ఎన్‌సీఎల్‌టీని ఆశ్రయించాయి. జెట్‌ ఎయిర్‌వేస్‌ దాదాపు 23,000 ఉద్యోగులకు రూ. 3,000 కోట్లు జీతాలు, ఇతరత్రా విమానాల వెండార్లు, లెస్సర్లకు (లీజుకిచ్చిన సంస్థలు) రూ. 10,000 కోట్ల దాకా బాకీపడింది.

మోసర్‌ బేయర్‌ ఆస్తుల విక్రయానికి ఆదేశం
నిర్దిష్ట గడువులోగా రుణ పరిష్కార ప్రణాళికకు రుణ దాతల నుంచి ఆమోదం పొందడంలో విఫలమైనందున మోసర్‌ బేయర్‌ సోలార్‌ ఆస్తులు విక్రయించాలంటూ ఎన్‌సీఎల్‌టీ మరో కేసులో ఆదేశించింది. ఇందులో భాగంగా కంపెనీకి లిక్విడేటర్‌గా అరవింద్‌ గర్గ్‌ వ్యవహరిస్తారని సూచించింది. లిక్విడేషన్‌ ప్రక్రియ జరిగే సమయంలో కంపెనీ కార్యకలాపాలు యథావిధిగా కొనసాగేలా గర్గ్‌ చూస్తారని పేర్కొంది. లిక్విడేషన్‌ ప్రకటన తేదీ నుంచి 75 రోజుల్లోగా ప్రాథమిక నివేదిక సమర్పించాలని లిక్విడేటర్‌కు ఎన్‌సీఎల్‌టీ సూచించింది. 2017 నవంబర్‌ 14న సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా పిటిషన్‌ను స్వీకరించడంతో మోసర్‌ బేయర్‌ సోలార్‌పై దివాలా చట్టం కింద చర్యల ప్రక్రియ ప్రారంభమైంది. సంస్థ లిక్విడేషన్‌ విలువ రూ. 72.42 కోట్లుగా ఉంటుందన్న అంచనాలు ఉన్నాయి. మోసర్‌ బేయర్‌ సోలార్‌ మాతృ సంస్థ మోసర్‌ బేయర్‌ ఇండియా కూడా లిక్విడేషన్‌ ప్రక్రియ ఎదుర్కొంటోంది.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా