టాప్ 5 నుంచి లెనోవా, షియామి ఔట్

29 Apr, 2016 14:47 IST|Sakshi
టాప్ 5 నుంచి లెనోవా, షియామి ఔట్

వాషింగ్టన్ : ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల్లో  చైనా హవా  ప్రపంచవ్యాప్తంగా సుపరిచితమే. అయితే ఈ మధ్యకాలంలో చైనా ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల పరిస్థితి కొంచెం భిన్నంగా మారినా తన బలాన్ని మాత్రం నిరూపించుకుంటూనే ఉన్నాయి.  ఈ క్రమంలో ప్రపంచ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో టాప్-5లో నిలిచిన ఫోన్లలో మూడు స్థానాలను మళ్లీ  చైనావే కైవసం చేసుకుంది. అయితే అంతకముందు టాప్-5లో ఉన్న లెనోవా, షియోమిలు మాత్రం తమ స్థానాలను కోల్పొయాయి. కొత్తగా స్మార్ట్ ఫోన్ల ప్రపంచంలోకి ప్రవేశించిన ఒప్పో, వివోలు వాటి స్థానాలను దక్కించుకున్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ కంపెనీలు కూడా చైనావే కావడం విశేషం.

ఐడీసీ నిర్వహించిన సర్వేలో 2016 మొదటి త్రైమాసికంలో శ్యామ్ సంగ్ మొదటిస్థానంలో నిలవగా, యాపిల్ రెండో స్థానంలో, హ్యువాయ్ మూడో స్థానంలో నిలిచాయి. 4.5 శాతంతో శ్యామ్ సంగ్ స్మార్ట్ ఫోన్ మార్కెట్ ను ఏలుతుండగా, 15.3శాతం మార్కెట్ షేరును మాత్రమే యాపిల్ కలిగిఉందని సర్వే వెల్లడించింది.  హ్యువాయ్ అమ్మకాలు 58 శాతం పెరిగి, 8.2 శాతం మార్కెట్ షేరును కల్గిఉందని సర్వే గుర్తించింది. కొత్తగా వచ్చిన ఒప్పో, వివో కంపెనీ స్మార్ట్ ఫోన్ లు చైనీస్ మార్కెట్ తోపాటు బయట మార్కెట్లోకి ఎక్కువగా విస్తరిస్తున్నాయని సర్వే పేర్కొంది. ఇలా వాటి షేరును పెంచుకోవడం వల్లనే లెనోవా,షియోమిలకు గట్టి పోటీని ఇచ్చి, వెనక్కి నెట్టేశాయని సర్వే తెలిపింది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ ఫోన్ మార్కెట్ వృద్ధి కేవలం 0.2 శాతం మాత్రమే ఉందని, 334.9మిలియన్ సరుకు రవాణా జరుగుతుందని ఐడీసీ రీసెర్చ్ సర్వే వెల్లడించింది.

మరిన్ని వార్తలు