హైదరాబాద్‌లో లెన్స్‌కార్ట్‌ ప్లాంట్‌?

4 Jan, 2017 00:23 IST|Sakshi
హైదరాబాద్‌లో లెన్స్‌కార్ట్‌ ప్లాంట్‌?

ఎయిర్‌ కనెక్టివిటీ పెరిగితే ఏర్పాటు
కంపెనీ కో–ఫౌండర్‌ అమిత్‌ చౌదరి


హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: కళ్లజోళ్ల వ్యాపారంలో ఉన్న లెన్స్‌కార్ట్‌ తయారీ కేంద్రాన్ని దక్షిణాదిన ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. కంపెనీకి ఇప్పటికే గుర్గావ్‌లో తయారీ యూనిట్‌ ఉంది. 2020 నాటికి సిద్ధం కాగల కొత్త ప్లాంటుకై హైదరాబాద్, బెంగళూరు నగరాలు అనువుగా ఉంటాయని సంస్థ భావిస్తోంది. విమాన సర్వీసులు పెరిగితే భాగ్యనగరిలోనే ప్లాంటును నెలకొల్పుతామని లెన్స్‌కార్ట్‌ సహ వ్యవస్థాపకులు అమిత్‌ చౌదరి సాక్షి బిజినెస్‌ బ్యూరోకు వెల్లడించారు. సంస్థ వ్యాపారంలో 60 శాతం దక్షిణాది రాష్ట్రాల నుంచే సమకూరుతోందని చెప్పారు. హైదరాబాద్‌ సహా దేశంలో 10 నగరాల్లో సుమారు రూ.27 కోట్ల వ్యయంతో అసెంబ్లింగ్‌ కేంద్రాలను అందుబాటులోకి తెస్తున్నట్టు పేర్కొన్నారు. వీటి ద్వారా తక్కువ సమయంలో కస్టమర్లకు ఉత్పత్తుల డెలివరీ సాధ్యమవుతుందని వివరించారు.

చిన్న నగరాల్లో స్టోర్లు..
కంపెనీకి దేశవ్యాప్తంగా 250 ఔట్‌లెట్లు ఉన్నాయి. రెండేళ్లలో వీటి సంఖ్యను 1,000కి చేర్చాలని లక్ష్యంగా చేసుకుంది. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో ఎక్కువ ఔట్‌లెట్లు రానున్నాయని అమిత్‌ తెలిపారు. ‘ఆన్‌లైన్‌ విక్రయాల ద్వారా 40 శాతం వ్యాపారం నమోదు చేస్తున్నాం. 3,000కుపైగా డిజైన్లు అందుబాటులో ఉంచాం. ప్రతి నెలా 40 కొత్త డిజైన్లను ప్రవేశపెడుతున్నాం. కంపెనీ ఉత్పత్తుల ధర రూ.600–5,000 మధ్య ఉంది. విభిన్న డిజైన్లు, అందుబాటు ధర, నాణ్యత కంపెనీ ప్రత్యేకత. వ్యవస్థీకృత రంగంలో టాప్‌–1తోపాటు పూర్తి స్థాయి తయారీ కంపెనీగా నిలిచాం. రోజుకు 8–10 వేల యూనిట్లు విక్రయిస్తున్నాం’ అని తెలిపారు. లెన్స్‌కార్ట్‌లో పెట్టుబడి చేసిన వారిలో రతన్‌ టాటా, అజీమ్‌ ప్రేమ్‌జీ ఉన్నారు.

>
మరిన్ని వార్తలు