2008 ప్యాకేజీ నుంచి పాఠాలు!

20 May, 2020 10:56 IST|Sakshi

తాజా ఉద్దీపన రూపకల్పనపై నిర్మలా సీతారామన్‌

కరోనా సంక్షోభిత ఎకానమీని ఆదుకునేందుకు ప్రభుత్వం రూ.20లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించింది. ఈ ప్యాకేజీని 2008-13 సంక్షోభ పాఠాలను గుర్తుంచుకొని రూపొందించామని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పారు. అందుకే విచ్చలవిడి వ్యయాన్ని ప్రోత్సహించకుండా జాగ్రత్తపడ్డామన్నారు. తాము ప్రకటించిన చర్యలతో నేరుగా ప్రజలవద్దకు సొమ్ము చేరి డిమాండ్‌ పెంచుతుందన్నారు. వలసకార్మికులను ఆదుకునేందుకు సిద్దంగా ఉన్నామని, కానీ వీరికి సంబంధించిన గణాంకాలు సరిగ్గాలేవని తెలిపారు. ప్యాకేజీ ప్రకటనకు ముందు అన్ని రకాల సలహాలు, సూచనలు స్వీకరించి అంతిమరూపునిచ్చామని వివరించారు. భవిష్యత్‌ పరిస్థితులను బట్టి మరిన్న చర్యలుంటాయని చెప్పారు. ఈ ప్యాకేజీ జీడీపీపై చూపే ప్రభావం చాలా స్వల్పమని నిపుణులు పెదవివిరుస్తున్న సంగతి తెలిసిందే! అయితే గతంలో వచ్చిన ఆర్థిక సంక్షోభ సమయంలో ఇచ్చిన ప్యాకేజీ లోటుపాట్లను గుర్తుంచుకొని తాజా ప్యాకేజీ రూపొందించామని నిర్మల చెప్పారు.

ఆర్‌బీఐ ద్వారా భారీ నగదు ఉద్దీపనలు అందించాలని ప్యాకేజీకి ముందు ఇండియా ఇంక్‌ కోరింది, కానీ ఈ కోరికను ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు. 2008 అనంతరం ప్రభుత్వం ఇచ్చిన ప్యాకేజీలతో 2013నాటికి ఎకానమీ పరిస్థితి బాగా దిగజారింది. ద్రవ్యోల్బణం రెండంకెలకు చేరడం, చెల్లింపుల శేషం క్షీణించడం, క్యాపిటల్‌ వలస, రూపీ క్షీణత లాంటివి ఆ సమయంలో పెరిగాయి. తాజా ప్యాకేజీతో ఇవన్నీ మళ్లీ తలెత్తకుండా జాగ్రత్త  పడేందుకే ఈ ప్యాకేజీని జాగ్రత్తగా రూపొందించామని ఆర్థికమంత్రి చెప్పారు. అనేక దేశాలు ప్రకటించిన ఉద్దీపనలు విశ్లేషించామన్నారు. బ్యాంకులకు ఇచ్చిన సాయం అంతిమంగా రుణాల రూపంలో పరిశ్రమలకు చేరుతుందని తెలిపారు. ఇదిక్రమంగా డిమాండ్‌ పెంచుతుందన్నారు. తమ ప్యాకేజీ సమాజంలో ప్రతి రంగాన్ని ఉద్దేశించినదని, ఇది అన్ని రంగాలకు చేయూతనిస్తుందని వివరించారు. 

మరిన్ని వార్తలు