ఆరోగ్య బీమా...ఖర్చుకాదు పెట్టుబడి

17 Jul, 2017 00:54 IST|Sakshi
ఆరోగ్య బీమా...ఖర్చుకాదు పెట్టుబడి

ఏదో ఒక పాలసీ అనుకోవద్దు
కవరేజీలో అన్ని అంశాలూ చూశాకే ఓకే చెప్పాలి  


ప్రస్తుతం ఆరోగ్య బీమా పాలసీ తీసుకోవడమనేది తప్పనిసరైపోయింది. ఒకరకంగా ఇది కూడా పెట్టుబడే. ఎందుకంటే వైద్య శాస్త్రం పురోగమిస్తున్న కొద్దీ కొత్త వ్యాధులు పుట్టుకొస్తున్నాయి. పర్యావరణ కాలుష్యం, క్రమపద్ధతి లోపించిన జీవన విధానాలు తదితరాలతో హృద్రోగాలు, క్యాన్సర్, హైపర్‌టెన్షన్, గ్యాస్ట్రిక్‌ సమస్యలు, ఊపిరితిత్తుల సమస్యలు.. ఇలాంటివెన్నో తలెత్తుతున్నాయి. వీటి చికిత్సా వ్యయాలు కూడా భారీగా ఉంటూ తలకు మించిన భారమవుతున్నాయి.

వీటి వల్ల అప్పుల బారిన పడే సందర్భాలూ తలెత్తుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో మధుమేహ వ్యాధిగ్రస్తులు భారత్‌లోనే ఉన్నారు. పరిస్థితులు తీవ్రంగా ఉంటున్నప్పటికీ... దేశీయంగా తగినంత స్థాయిలో ఆరోగ్య బీమా పాలసీ తీసుకునే వారి సంఖ్య చాలా తక్కువే. మొత్తం జనాభాలో స్వచ్ఛందంగా ఏదో ఒక హెల్త్‌ కవరేజీ తీసుకున్న వారి సంఖ్య 3 శాతం కన్నా తక్కువే ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆరోగ్య బీమా పాలసీ ప్రాధాన్యం తెలిపేందుకే ఈ కథనం.

సరైన ప్లాన్‌ ఎంచుకోవాలి..
ప్రస్తుతం ప్రభుత్వ రంగ, ప్రైవేట్‌ రంగ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీలు అనేక ఆప్షన్లతో ఆరోగ్య బీమా పాలసీలు అందిస్తున్నాయి. అనేకం ఉన్నప్పటికీ.. మనకు అనువైనది ఎంచుకోవడం చాలా ముఖ్యం. పాలసీ ఎంపికలో ప్రీమియం ఒక్కటే ప్రామాణికం కాదు. ప్రీమియం తక్కువగా ఉండటంతో పాటు పాలసీ సమగ్రమైనదిగా ఉండాలి. వ్యక్తిగత పాలసీ తీసుకో వాలా లేక ఫ్యామిలీ ఫ్లోటర్‌ ఎంచుకోవాలా అన్నది చూసుకోవాలి.

గతం నుంచీ ఉన్న వ్యాధులకు కూడా కవరేజీ ఉంటోందా? లైఫ్‌టైమ్‌ రెన్యూవల్‌ సదుపాయం ఉందా? ప్రీ..పోస్ట్‌ హాస్పిటలైజేషన్‌ వ్యయాలకు కవరేజీ లభిస్తోందా? నగదు రహిత చికిత్స ప్రయోజనాలు .. డే కేర్‌ ట్రీట్‌మెంట్‌  వంటి వి ఉన్నాయా? ఇవన్నీ పరిశీలించుకోవాలి. అలాగే దేనికి ఎంత వరకూ కవరేజీ (సబ్‌ లిమిట్స్‌) ఉం టోంది చూసుకోవాలి. క్యాన్సర్, హార్ట్‌ఎటాక్, పక్షవాతం వంటి ప్రాణాంతక సమస్యలు సర్వసాధారణంగా మారిపోతున్న నేపథ్యంలో వీలైతే రెగ్యులర్‌ ప్లాన్‌తో పాటు టాప్‌ అప్‌ ప్లాన్‌ కూడా తీసుకునే అవకాశాన్నీ పరిశీలించవచ్చు.

ఆరోగ్య జీవన విధానానికి రివార్డులు..
ఈ మధ్య కొన్ని హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీలు.. ఆరోగ్యకరమైన జీవన విధానం సాగించే పాలసీదారులకు నో క్లెయిమ్‌ బోనస్‌తో పా టు మరికొన్ని ప్రత్యేక ప్రయోజనాలు కల్పిస్తున్నాయి. నగదుకు సమానమైన రివార్డులు అందిస్తున్నాయి. ఔషధాలు కొనుక్కునేందు కు, వైద్య పరీక్షల ఖర్చుల చెల్లింపులకు, అవుట్‌ పేషంట్‌ వ్య యాలు, డే కేర్‌ ట్రీట్‌మెంట్‌ లాంటి వాటికి వీటిని ఉపయోగించుకోవచ్చు. లేదా భవిష్యత్‌ ప్రీమియంల చెల్లింపులకు సర్దుబాటు కూడా చేసుకోవచ్చు.

గుర్తుంచుకోవాల్సిన అంశాలు..
పాలసీ తీసుకునేటప్పుడు ఆరోగ్యానికి సంబంధించిన అంశాలేమీ దాచిపెట్ట కుండా ఉండటం శ్రేయస్కరం. సగం సగం సమాచారమిచ్చినా.. లేదా తప్పుడు వివరాలు ఇచ్చినట్లు తేలినా .. కచ్చితంగా అవసరం తలెత్తినప్పుడు పాలసీని కంపెనీలు తిరస్కరించే ప్రమాదం ఉంది. కనుక ఆరోగ్యం.. అనారోగ్యం  వివరాలేమీ దాచిపెట్టకుండా వెల్లడించడమే శ్రేయస్కరం. అలాగే.. పాలసీ పరిభాషను, నిబంధనలను కూడా క్షుణ్నంగా తెలుసుకోవాలి. పాలసీ సెటిల్మెంట్‌ టైమ్, సెటిల్మెంట్‌ నిష్పత్తి, కో–పేమెంట్‌ షరతులు మొదలైన నిబంధనలు అనేకం ఉంటాయి.

పన్ను ఆదాకు మించి ప్రయోజనాలు
ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్‌ 80డీ కింద హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ప్రీమియంలపై కొంత పన్ను ప్రయోజనాలూ లభిస్తాయి. దీంతో పన్ను ఆదా అవుతుంది కదా అనే ఉద్దేశంతో కూడా ఈ పాలసీలు తీసుకునే వారున్నారు. అయితే, కేవలం ఆ దృష్టితో మాత్రమే చూడకుండా.. అనూహ్యంగా తలెత్తే చికిత్స ఖర్చులతో అస్తవ్యస్తం కాకూడదన్నదే పాలసీ కొనుగోలు పరమార్ధం అయి ఉండాలి.

మరిన్ని వార్తలు