బాలల భవితకు ఇపుడే ప్లాన్ చేద్దాం

11 May, 2014 00:35 IST|Sakshi
బాలల భవితకు ఇపుడే ప్లాన్ చేద్దాం

బాలల బంగారు భవితకు బాటలు వేయాల్సింది తల్లిదండ్రులే. పిల్లల ఆరోగ్య సంరక్షణకు, ఉన్నత విద్యకు, వివాహాలకు ప్రణాళికాబద్ధంగా పొదుపు చేయాలి. సమాజంలో ఎక్కువ మందికి ఉండేది స్థిరాదాయమే కాబట్టి, కుటుంబ బడ్జెట్లో పిల్లల భవిష్యత్తు అవసరాలకు తగిన ఏర్పాట్లుండాలి. పిల్లల ఉన్నత విద్యకు డబ్బు ఆటంకం కాకూడదని అందరూ కోరుకుంటారు. చదువుకయ్యే వ్యయం ఏటేటా పెరిగిపోతున్న విషయాన్ని పెద్దలు దృష్టిలో ఉంచుకోవాలి. బాలలకు తగిన ఎన్నో బీమా పథకాలిపుడు అందుబాటులో ఉన్నాయి. వీటిలో సరైన వాటిని ఎంచుకుంటే వారి భవిష్యత్తు ఒడిదుడుకుల్లేకుండా సాగిపోతుంది.

అలాంటి వాటిని ఎంపిక చేయడానికి నాలుగు సులువైన సూత్రాలివి...
   బాలల భవిష్యత్తుకు తగిన ప్లాన్ రూపొందించి, సాధ్యమైనంత ముందుగానే పెట్టుబడులు ప్రారంభించాలి. పిల్లలకు 18 ఏళ్లు నిండిన వెంటనే మెచ్యూరిటీ బెనిఫిట్లను అందించే పథకాలను అనేక బీమా కంపెనీలు ఆఫర్ చేస్తున్నాయి. అలాగే, 18 ఏళ్లు నిండిన తర్వాత నిర్ణీత కాలాల్లో చెల్లింపులు చేసే ప్లాన్లూ ఉన్నాయి. కనుక, మీ లక్ష్యాలను నిర్దేశించుకుని, మంచి ఫైనాన్షియల్ ప్లానర్‌ను సంప్రదించి దీర్ఘకాలిక పెట్టుబడులకు శ్రీకారం చుట్టండి.

 బాలలకు సంబంధించిన అనేక ప్లాన్లలో ప్రీమియం మాఫీ కూడా ఉంటుంది. దురదృష్టవశాత్తూ పేరెంట్ మరణిస్తే ఆ తర్వాతి నుంచి ప్రీమియం కట్టాల్సిన అవసరం ఉండదు. పాలసీ మెచ్యూరిటీ అయ్యే వరకు బీమా కంపెనీలే ఆ భారాన్ని భరిస్తాయి. ప్రీమియం మాఫీ ఒక ఆప్షన్‌గా ఉండవచ్చు లేదా ప్రధాన ప్లాన్‌లో ఒక అంశంగా ఉండవచ్చు.

తగినంత రిస్కు కవరేజీ, ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్లు ఉండే ప్లాన్‌ను ఎంచుకోవడం మంచిది. అంటే, మీ ప్లాన్‌లో గ్రోత్, డెబిట్ ఫండ్లు, రిస్కు కవరేజీ సమతులంగా ఉండాలి. ఇన్వెస్ట్‌మెంట్లపై లాభాలను పదిలంగా ఉంచే సిస్టమ్ ట్రాన్స్‌ఫర్ ఆప్షన్ కలిగిన ప్లాన్‌ను ఎంపిక చేసుకోవాలి. వార్షిక ప్రీమియంకు కనీసం 20 రెట్లుండే రిస్క్ కవర్‌ను తీసుకోవాలి. ఎందుకంటే, పిల్లల తరఫున బీమా చేయించిన వ్యక్తి చనిపోతే ఆ కుటుంబానికి గణనీయమైన మొత్తం అందుతుంది.

  పాలసీ బ్రోచర్‌ను క్షుణ్ణంగా చదవాలి. పాలసీకి అయ్యే ఖర్చును ఆకళింపు చేసుకోవాలి. ఏ ప్రొడక్టుకు ఎంత వ్యయం అవుతుందో బ్రోచర్లో విపులంగా ఉంటుంది. వివిధ కంపెనీలు అందిస్తున్న ప్రొడక్టులను, వాటి చార్జీలనూ విశ్లేషించాలి. బీమా కంపెనీ ప్రతిష్టను, వారందించే సేవలను పరిశీలించాలి. ప్లాన్లలోని ఫ్లెక్సిబిలిటీని తెలుసుకోవాలి. ఏమైనా అనుమానాలుంటే ఇన్సూరెన్స్ ఏజెంటును అడిగి తెలుసుకోవాలి.

మరిన్ని వార్తలు