టాప్‌–3లో తెలుగు రాష్ట్రాలు: ఎల్‌జీ

12 May, 2018 01:32 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాల రంగంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో 2018లో 30 శాతం వాటా లక్ష్యంగా చేసుకున్నట్టు ఎల్‌జీ వెల్లడించింది. ఏటా రూ.8,000 కోట్ల వ్యాపారం జరుగుతున్న ఈ మార్కెట్లలో గత ఏడాది కంపెనీ 27 శాతం పైగా వాటాను సాధించింది. 2017లో తెలుగు రాష్ట్రాల్లో రూ.2,300 కోట్లకుపైగా టర్నోవర్‌ నమోదు చేశామని ఎల్‌జీ ఇండియా రీజినల్‌ బిజినెస్‌ హెడ్‌ కె.శశికిరణ్‌ రావు తెలిపారు.

భారత్‌లో కంపెనీ 21 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శుక్రవారమిక్కడ ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ఏడాది టర్నోవర్‌ 15–20% అధికం గా ఆర్జిస్తామని చెప్పారు. ఆదాయం పరంగా సంస్థకు ఢిల్లీ, తమిళనాడు తర్వాతి స్థానాన్ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లు సంయుక్తంగా కైవసం చేసుకున్నాయని వెల్లడించారు. ఎల్‌జీ ఇండియా ఆదాయంలో 14 శాతం ఇక్కడి నుంచి సమకూరుతోందని వివరించారు. రెండు రాష్ట్రాల్లో కొత్తగా 20 ఎక్స్‌క్లూజివ్‌ ఔట్‌లెట్లను ప్రారంభిస్తామన్నారు. కాగా, 21 ఏళ్ల వేడుకల్లో భాగంగా జూన్‌ 10 వరకు కొన్ని రకాల ఉపకరణాల కొనుగోళ్లపై పలు బహుమతులను అందిస్తోంది. ఎంపిక చేసిన క్రెడిట్‌ కార్డులపై 7.5 శాతం వరకు క్యాష్‌బ్యాక్‌ ఉంది.

మరిన్ని వార్తలు