ఎల్‌జీ స్మార్ట్ గ్లాసెస్ వస్తున్నాయ్..

23 Jun, 2014 08:15 IST|Sakshi
ఎల్‌జీ స్మార్ట్ గ్లాసెస్ వస్తున్నాయ్..

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గూగుల్ తరహాలో రూపొందుతున్న స్మార్ట్ గ్లాసెస్‌ను ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ ఈ ఏడాదే మార్కెట్లోకి  తెచ్చే అవకాశాలున్నాయి. అయితే గూగుల్ గ్లాస్‌లా కాకుండా సొంతంగా అభివృద్ధి చేస్తున్న ‘గ్లాస్‌టిక్’ పరిజ్ఞానాన్ని ఎల్‌జీ ఇందుకు ఉపయోగిస్తోంది. 2013 నవంబరులోనే  గ్లాస్‌టిక్ ట్రేడ్‌మార్క్ కోసం మొబైల్స్, స్పెక్టాకిల్స్(ఆప్టిక్స్) విభాగంలో కంపెనీ దరఖాస్తు చేసుకుంది. స్మార్ట్ గ్లాసెస్ వస్తున్న విషయాన్ని ఎల్‌జీ ఉన్నతాధికారి ఒకరు ధ్రువీకరించారు.

ఈ ఏడాదే ఇవి మార్కెట్లోకి రావచ్చని చెప్పారు. మార్కెట్లో ఉన్న గ్లాసెస్‌తో పోలిస్తే పూర్తిగా భిన్నంగా ఇవి ఉండబోతున్నాయని.. ధర ఎంత ఉండేది ఇప్పుడే చెప్పలేమన్నారు. స్మార్ట్ గ్లాసెస్ కళ్లజోడు మాదిరిగా ఉండే చిన్నపాటి కంప్యూటర్. బ్యాటరీ, సీపీయూ, స్పీకర్, కెమెరా, మైక్రోఫోన్ దీనికి ఉంటాయి. ఫోన్‌కాల్స్ చేయొచ్చు. అద్దాలకు ముందువైపు గాజు వంటి చిన్న తెర ప్రిసమ్ ఉంటుంది. నచ్చిన వీడియోలు చూడొచ్చు. కెమెరాతో వీడియో రికార్డింగ్,  ఫోటోలు తీయొచ్చు.

మరిన్ని వార్తలు