ఎల్‌ఐసీ చేతికి ఐడీబీఐ బ్యాంకు 

2 Aug, 2018 00:14 IST|Sakshi

మెజారిటీ వాటా కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం...

హిందుస్తాన్‌ కాపర్‌ నిధుల సమీకరణకూ అనుమతి

కేంద్ర కేబినెట్‌ నిర్ణయాలు  

న్యూఢిల్లీ: ఐడీబీఐ బ్యాంకులో 51 శాతం నియంత్రిత వాటాను ఎల్‌ఐసీ సొంతం చేసుకునేందుకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. హిందుస్తాన్‌ కాపర్‌ కంపెనీ తాజాగా 15 శాతం ఈక్విటీ జారీ ద్వారా రూ.900 కోట్ల సమీకరణకు కూడా అనుమతి తెలిపింది. బుధవారం ప్రధాని అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్‌ భేటీలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్న ఐడీబీఐ బ్యాంకు ఎల్‌ఐసీకి ప్రిఫరెన్షియల్‌ షేర్లను జారీ చేయడం ద్వారా నిధులను సమీకరిస్తుంది. ఐడీబీఐ బ్యాంకులో ఎల్‌ఐసీకి ఇప్పటికే 7.5 శాతం వాటా ఉంది. మిగిలిన మేర మెజారిటీ వాటాను ప్రిఫరెన్షియల్‌ షేర్ల రూపంలో సొంతం చేసుకోనుంది. ఈ విధానంలో ఐడీబీఐ బ్యాంకుకు రూ.10,000–13,000 కోట్ల మేర తాజా నిధులు అందుబాటులోకి వస్తాయి. కేంద్ర ప్రభుత్వానికి నిధులు సమకూరవు. ఇప్పటి వరకు కేంద్రం తన వాటాను ఎల్‌ఐసీకి విక్రయించడం ద్వారా ఖజానా నింపుకుంటుందని భావించారు.  

హెచ్‌సీఎల్‌ నిధుల సమీకరణ 
హిందుస్తాన్‌ కాపర్‌ లిమిటెడ్‌ (హెచ్‌సీఎల్‌) 15 శాతం తాజా ఈక్విటీ జారీ చేయడం ద్వారా రూ.900 కోట్లను సమీకరించేందుకు కేబినెట్‌ ఆమోదించింది. దీంతో హెచ్‌సీఎల్‌ 13.87 కోట్ల షేర్లను(15%) జారీ చేయనుంది. దీంతో కేంద్రం వాటా 66.13 శాతానికి తగ్గిపోతుంది. ప్రస్తుతం ప్రభుత్వానికి 76.05 శాతం వాటా ఉంది. ప్రస్తుత మార్కెట్‌ ధర ప్రకారం చూస్తే తాజా షేర్ల జారీ ద్వారా కంపెనీకి రూ.900.6 కోట్లు సమకూరతాయి. క్యూఐపీ ద్వారా ఈ ప్రక్రియను కంపెనీ పూర్తి చేయనుంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, జార్ఖండ్‌ రాష్ట్రాల్లో ప్రాజెక్టుల విస్తరణకు ఈ నిధుల్ని వెచ్చించనుంది. తాజా షేర్లను జారీ చేస్తుండడంతో కంపెనీ చెల్లించిన మూలధనం రూ.462.61కోట్ల నుంచి రూ.532కోట్లకు పెరుగుతుంది.  

ఏకకాలంలో అన్ని రకాల ఇంధనాల ఉత్పత్తి 
సంప్రదాయేతర ఇంధనాలైన కోల్‌ బెడ్‌ మీథేన్‌ (సీబీఎం), షేల్‌ గ్యాస్‌తోపాటు సంపద్రాయ చమురు, సహజ వాయువులను ఏకకాలంలో వెలికితీసేందుకు కేంద్రం అనుమతించింది. లాభాల్లో 10% అదనపు చెల్లింపు ద్వారా అనుమతికి అవకాశం కల్పించింది. సంప్రదాయ ఇంధనాలైన చమురు, సహజ వాయువు ఉత్పత్తికి సంబంధించిన పర్మిట్‌తో ప్రస్తుతం షేల్‌ ఆయిల్, గ్యాస్, సీబీఎంల ఉత్పత్తికి అనుమతి లేదు. ఈ నిర్ణయంతో కొత్త పెట్టుబడులు, ఉత్పత్తి పెరుగుతుందని కేంద్రం భావిస్తోంది.   

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా