ఐడీబీఐ బ్యాంక్‌కు ఎల్‌ఐసీ నిధులు

16 Feb, 2019 00:44 IST|Sakshi

న్యూఢిల్లీ: ఐడీబీఐ బ్యాంక్‌లో ఎల్‌ఐసీ మరో రూ.12,000 కోట్లు పెట్టుబడులు పెట్టే అవకాశాలున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో మొండి బకాయిలకు కేటాయింపుల కోసం ఈ స్థాయి పెట్టుబడులను ఎల్‌ఐసీ సమకూరుస్తుందని సమాచారం. ఈ విషయమై ఇటీవలనే ఇరు సంస్థల ఉన్నతాధికారులు ఆర్థిక సేవల విభాగం అధికారులతో సమావేశమయ్యారు. కాగా తాజా పెట్టుబడుల విషయమై ఎల్‌ఐసీ ఇప్పటి వరకూ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. 

ఎల్‌ఐసీ పెట్టుబడులు రూ.21,624 కోట్లు 
ఐడీబీఐ బ్యాంక్‌లో ఎల్‌ఐసీ 51 శాతం వాటాను పొందిన విషయం తెలిసిందే. ఈ వాటా కోసం ఐడీబీఐ బ్యాంక్‌లో ఎల్‌ఐసీ రూ.21,624 కోట్లు పెట్టుబడులు పెట్టింది. ఎల్‌ఐసీ పెట్టుబడులతో ఐడీబీఐ బ్యాంక్‌ కామన్‌ ఈక్విటీ టైర్‌–వన్‌(సెట్‌–1) మూలధనం గత ఏడాది డిసెంబర్‌ 31 నాటికి 9.32 శాతానికి పెరిగింది. అంతకు ముందటి ఏడాది ఇదే సమయానికి సెట్‌–1 మూలధనం 6.62 శాతంగానే ఉంది. కాగా ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో ఐడీబీఐ బ్యాంక్‌ నికర నష్టాలు మూడు రెట్లు పెరిగి రూ.4,185 కోట్లకు పెరిగాయి. గత క్యూ3లో రూ.7,125 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ3లో రూ.6,191 కోట్లకు తగ్గింది. స్థూల మొండి బకాయిలు 24.72% నుంచి 29.67 శాతానికి పెరగ్గా, నికర మొండి బకాయిలు మాత్రం 16.02% నుంచి 14.01 శాతానికి తగ్గాయి.   

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు