స్టాక్ మార్కెట్లో ఎల్‌ఐసీకి లాభాల పంట...

3 Aug, 2015 00:10 IST|Sakshi

ముంబై : స్టాక్ మార్కెట్లో పెట్టుబడులపై ఎల్‌ఐసీ గత ఆర్థిక సంవత్సరంలో భారీ లాభాలను కళ్లజూసింది. దేశీయ అతి పెద్ద సంస్థాగత ఇన్వెస్టర్ అయిన ఎల్‌ఐసీ గత ఆర్థిక సంవత్సరంలో స్టాక్ మార్కెట్ పెట్టుబడులపై  రూ.24,373 కోట్ల లాభాలార్జించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం వచ్చిన లాభాల(రూ.21,257 కోట్ల)తో పోల్చితే 15 శాతం వృద్ధి సాధించింది.  2013-14 ఆర్థిక సంవత్సరం కంటే గత ఆర్థిక సంవత్సరంలో రూ.7,328 కోట్లు తక్కువగా పెట్టుబడులు పెట్టినప్పటికీ, లాభాలు 15 శాతం వృద్ధి సాధించడం విశేషం.

2013-14లో ఎల్‌ఐసీ స్టాక్ మార్కెట్లో రూ.54,330 కోట్లు ఇన్వెస్ట్ చేయగా, గత ఆర్థిక సంవత్సరంలో రూ.47,002 కోట్లు ఇన్వెస్ట్ చేసింది. ఈ వివరాలను ఎల్‌ఐసీ చైర్మన్ ఎస్. కె. రాయ్ ఇటీవల పీటీఐకి వెల్లడించారు. గత ఆర్థిక సంవత్సరంలో స్టాక్ మార్కెట్ 25 శాతానికి పైగా వృద్ధి సాధించడంతో ఈ స్థాయి రాబడులు వచ్చాయని నిపుణులంటున్నారు. దాదాపు రూ.2 లక్షల కోట్ల హోల్డింగ్స్‌తో ఎల్‌ఐసీ భారత స్టాక్ మార్కెట్లో అతి పెద్ద ఇన్వెస్టర్‌గా అవతరించింది. పలు బ్లూచిప్ షేర్లలో చెప్పుకోదగ్గ వాటా ఎల్‌ఐసీకి ఉంది. 30 కోట్ల మంది పాలసీదారులతో 17.7 లక్షల కోట్ల ఆస్తులతో కార్యకలాపాలను నిర్వహిస్తోంది.

మరిన్ని వార్తలు