‘చెల్లింపు’ లైసెన్స్‌లు టిక్‌ పెట్టి ఇచ్చేవి కావు: గాంధీ

21 Feb, 2017 00:54 IST|Sakshi
‘చెల్లింపు’ లైసెన్స్‌లు టిక్‌ పెట్టి ఇచ్చేవి కావు: గాంధీ

ముంబై: చెల్లింపుల (పేమెంట్‌) సేవలకు లైసెన్స్‌లు అన్నవి టిక్‌ పెట్టి ఇచ్చే తరహావి కావని ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌ ఆర్‌.గాంధీ అన్నారు. ఆయా సంస్థల చేతికి డబ్బులు అప్పగించడం కనుక లైసెన్స్‌ల జారీకి తగిన, నిర్దేశిత ప్రమాణాలు అవసరమని ఆయన స్పష్టం చేశారు. సోమవారం ముంబైలో భారత్‌ క్యూఆర్‌ కోడ్‌ ఆవిష్కరణ కార్యక్రమం సందర్భంగా గాంధీ మాట్లాడారు. ‘‘చెల్లింపుల రంగాన్ని లైసెన్స్‌ల ప్రక్రియ నుంచి మినహాయించాలని, అర్హతలు ఉన్న వాటిని కార్యకలాపాల నిర్వహణకు అనుమతించాలన్న సూచన ఉంది. కానీ, ఈ ఆలోచనతో  మేము విభేదిస్తున్నాం. అలా ఉచిత ప్రవేశం అన్నది చెల్లింపుల రంగానికి సముచితం కాదు.

ఎందుకంటే చెల్లింపుల సేవలు అందించే సంస్థల చేతుల్లో పెద్ద ఎత్తున డబ్బు ఉంటుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. కనుక తగిన, నిర్దేశిత ప్రమాణాలు అన్నవి చాలా అవసరం. టిక్‌ చేసి ఉచితంగా అనుమతించే విధానం ఈ రంగానికి సరైనది కాదు. ఇలా చేస్తే మొత్తం వ్యవస్థకే ప్రమాదం తలెత్తుతుంది’’ అని గాంధీ వివరించారు. చెల్లింపుల సేవల విషయంలో  బ్యాంకింగేతర సంస్థల పట్ల వివక్ష ఉందన్న  అభిప్రాయాన్ని కొట్టిపారేశారు.

మరిన్ని వార్తలు