ఐడీబీఐ బ్యాంక్‌లో 7% వాటా కొంటాం

29 Aug, 2018 00:17 IST|Sakshi

ఐడీబీఐ బ్యాంక్‌కు ఎల్‌ఐసీ లేఖ...

ఈ నెల 31న ఐడీబీఐ బోర్డ్‌ భేటీ

ఎల్‌ఐసీకి వాటా విక్రయంపై చర్చించనున్నట్లు వెల్లడి

న్యూఢిల్లీ: ఐడీబీఐ బ్యాంక్‌ను చేజిక్కించుకునే ప్రక్రియలో ఎల్‌ఐసీ మరో అడుగు ముందుకు వేసింది. ఐడీబీఐ బ్యాంక్‌లో అదనంగా మరో 7 శాతం వాటాను ఎల్‌ఐసీ కొనుగోలు చేయనున్నది. ఈ మేరకు తమకు ఎల్‌ఐసీ నుంచి ఒక లేఖ అందిందని ఐడీబీఐ బ్యాంక్‌ తెలిపింది. తమ బ్యాంక్‌లో ఎల్‌ఐసీకి ఇప్పటికే 7.98 శాతం వాటా ఉందని,  ఈ వాటాను 14.90 శాతానికి పెంచుకోనున్నామని తాజాగా ఎల్‌ఐసీ తమకు ఒక లేఖ రాసిందని ఐడీబీఐ బ్యాంక్‌ స్టాక్‌ ఎక్సే్చంజ్‌లకు నివేదించింది.

ఈ మేరకు ఎల్‌ఐసీకి ప్రిఫరెన్షియల్‌ ప్రాతిపదికన ఈక్విటీ షేర్ల జారీ కోసం వాటాదారుల ఆమోదాన్ని పోస్టల్‌ బ్యాలెట్‌ రూపంలో కోరనున్నామని పేర్కొంది. ఈ విషయమై చర్చించడానికి ఈ నెల 31న డైరెక్టర్ల బోర్డ్‌ సమావేశమవుతోందని వివరించింది. ప్రస్తుతం ఐడీబీఐ బ్యాంక్‌లో ఎల్‌ఐసీకి 7.98% వాటా ఉంది.ఈ వాటాను 51%కి పెంచుకోవడానికి ఎల్‌ఐసీకి కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.

ఐఆర్‌డీఏఐ ఆమోదం: కాగా ఐడీబీఐ బ్యాంక్‌లో 51 శాతం వాటా కొనుగోలుకు ఎల్‌ఐసీకి బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ, ఐఆర్‌డీఏఐ ఈ ఏడాది జూన్‌లోనే ఆమోదం తెలిపింది. ప్రస్తుత నిబంధన ప్రకారమైతే, ఏ బీమా సంస్థ కూడా స్టాక్‌ మార్కెట్లో లిస్టైన ఆర్థిక సంస్థలో 15 శాతానికి మించిన వాటాను కొనుగోలు చేయకూడదు. కానీ ఈ నిబంధన నుంచి ఎల్‌ఐసీకి ఐఆర్‌డీఏఐ మినహాయింపునిచ్చింది. మరోవైపు చాలా కాలంగా బ్యాంకింగ్‌ రంగంలోకి ప్రవేశించాలని ఎల్‌ఐసీ ప్రయత్నాలు చేస్తోంది.

ఐడీబీఐ బ్యాంక్‌లో 51 శాతం వాటా కొనుగోలు ద్వారా ఎల్‌ఐసీ చిరకాల స్వప్నం నెరవేరనున్నది. దేశవ్యాప్తంగా ఉన్న 2,000 ఐడీబీఐ బ్యాంక్‌ బ్రాంచీలు ఎల్‌ఐసీ పరమవుతాయి. మరోవైపు మొండి బకాయిలు అధికమై, భారీ నష్టాలతో కుదేలైన ఐడీబీఐ బ్యాంక్‌కు ఎల్‌ఐసీ వాటా కొనుగోలు ద్వారా భారీ స్థాయిలో నిధుల సమకూరుతాయి. 22 కోట్లకు పైగా ఎల్‌ఐసీ పాలసీ ఖాతాలు ఐడీబీఐ బ్యాంక్‌కు దక్కుతాయి. ఎల్‌ఐసీ 7 శాతం వాటాను కొనుగోలు చేయనున్నదన్న ప్రకటన వెలువడగానే ఐడీబీఐ బ్యాంక్‌ షేర్లు 5 శాతం తగ్గి రూ.57.85కు పడిపోయాయి. ఆ తర్వాత కోలుకున్నాయి. చివరకు 1 శాతం నష్టంతో రూ. 60.80 వద్ద ముగిశాయి.


ఐడీబీఐ బ్యాంక్‌కు భారీ నిధులు !
ఈ వాటా విక్రయం కారణంగా ఐడీబీఐకి భారీ స్థాయిలో నిధులు లభించనున్నాయని నిపుణులంటున్నారు. దీంతో బ్యాంక్‌ మూలధన నిధుల నిబంధనలను అందుకోగలుగుతుందని వారంటున్నారు. ఐడీబీఐ బ్యాంక్‌లో ప్రభుత్వానికి 85.96 శాతం వాటా ఉంది. ఈ ఆర్థిక సంవత్సరం జూన్‌ క్వార్టర్‌లో ఈ బ్యాంక్‌కు రూ.2,410 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. ఈ బ్యాంక్‌ స్థూల మొండి బకాయిలు రూ.57,807 కోట్లుగా ఉన్నాయి.

మరిన్ని వార్తలు