కళతప్పిన ‘లిప్‌స్టిక్‌’

28 May, 2020 13:21 IST|Sakshi

కోవిడ్‌-19 మహమ్మారితో చాలా రకాల వ్యాపారాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రస్తుతం ఈ జాబితాలోకి లిప్‌స్టిక్‌ కూడా చేరింది. కోవిడ్‌ విజృంభణను అదుపుచేసేందుకు ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో లాక్‌డౌన్‌ విధించారు. కొన్ని దేశాల్లో లాక్‌డౌన్‌ ఎత్తివేసినప్పటికీ మరికొన్ని దేశాల్లో ఇప్పటికీ లాక్‌డౌన్‌ కొనసాగుతుంది. దీంతో ఎక్కువమంది ఇంట్లో నుంచే పనిచేయాల్సి వస్తోంది. ఇంట్లో ఉన్నవారు లిప్‌స్టిక్‌ని తక్కువగా వినియోగించడంతో వీటి అమ్మకాలు భారీగా పడిపోయాయి. ఒక వేళ ఎవరైనా బయటకొచ్చినా గానీ మాస్క్‌ తప్పనిసరి కాబట్టి లిప్‌స్టిక్‌ పెట్టుకున్నా ఉపయోగం ఉండదు. అందువల్ల వినియోగం తగ్గిందని మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. అంతేగాకుండా లాక్‌డౌన్‌ తర్వాత కూడా ఆఫీసు కార్యాలయాల్లో మాస్క్‌లు ధరిచడం తప్పనిసరి కావున అప్పుడు కూడా విక్రయాలు పెద్దగా ఉండవని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. డిమాండ్‌ తగ్గి విక్రయాలు పడిపోవడంతో లిప్‌స్టిక్‌ వ్యాపారాలు చేసేవారంతా ‘ఐ’ మెకప్‌పై దృష్టిపెడుతున్నారు. దీనిలో భాగంగా ఐలైనర్స్‌, మస్కారా, ఐ షాడో వంటి ఉత్పత్తుల తయారీకి మొగ్గుచూపుతున్నారు.
 సామాజిక,విందూ,వినోద, వివాహదీ శుభ కార్యక్రమాలకు ఎక్కువ మందికి అనుమతి లేకపోవడం, వర్కింగ్‌ ఫ్రంహోంకు ప్రాధాన్యత ఇస్తుండడంతో లిప్‌స్టిక్‌కు ప్రాధాన్యత తగ్గిందని లోరియల్‌ ఇండియా డైరెక్టర్‌ కవిత అంగ్రే  చెబుతున్నారు.ఏవైనా అధికారిక కార్యక్రమాలను వీడియో కాన్ఫరెన్సింగ్‌ ద్వారా నిర్వహించినప్పుడు మాత్రమే లిప్‌స్టిక్‌ను వాడుతున్నారని, అంతకు మించి పెద్దగా డిమాండ్‌ లేదని, అందువల్ల ఐ మేకప్‌పై దృష్టిపెట్టినట్లు ఆమె పేర్కొన్నారు. మనమంతా మనుషులం, ఎప్పటికైనా సమాజంలో తిరగక తప్పదు. దానికోసం కొత్త మార్గాలను అన్వేషించి మళ్లీ మునుపటి పరిస్థితుల్లోకి వెళతాము. అప్పుడు లిప్‌స్టిక్‌కు డిమాండ్‌ ఏర్పడుతుందన్నారు.
వ్యాపారులంతా ఐ మేకప్‌పై ఆసక్తి కనబరుస్తుండడంతో  ఐ షాడో విక్రయాలు టాప్‌-5 నుంచి టాప్‌-3లోకి వచ్చాయని  బ్యూటీ రిటైలర్‌ నైకా అధికార ప్రతినిధి చెప్పారు. కాగా మరోపక్క వ్యక్తిగత పరిశుభ్రతకు వినియోగదారుల ప్రాధాన్యం పెరిగినందున లిప్‌ బామ్స్‌, ఫేస్‌క్రీమ్స్‌కు డిమాండ్‌ భారీగా పెరిగింది.

Related Tweets
మరిన్ని వార్తలు