మెరుపులు తగ్గిన జ్యుయలరీ

28 Apr, 2018 01:44 IST|Sakshi

నీరవ్‌ మోదీ దెబ్బతో నిలిచిన ఐపీవోలు

ఈ రంగానికి రుణాలు మరింత కఠినం

న్యూఢిల్లీ: ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీ, గీతాంజలి జెమ్స్‌ ప్రమోటర్‌ మెహుల్‌చోక్సీలు పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకును రూ.13,000 కోట్లకు పైగా చేసిన మోసం బయటపడటంతో ఆ ప్రభావం పరిశ్రమలోని ఇతర కంపెనీల ప్రణాళికలకు బ్రేకులు వేసింది. కొన్ని కంపెనీలు ఐపీవోకు వచ్చేందుకు సన్నద్ధం అవుతుండగా మోదీ స్కామ్‌ నేపథ్యంలో అవి పునరాలోచనలో పడ్డాయి.

పునరాలోచనలో జోయ్‌ అలుకాస్‌...
జోయ్‌ అలుకాస్‌ గ్రూపు ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌కు రావాలనుకోగా ప్రస్తుతానికి దాన్ని పక్కన పెట్టింది. వచ్చే ఏడాది ఎన్నికల అనంతరమే దీనిపై నిర్ణయిస్తామని ఈ సంస్థ సీఈవో బేబీ జార్జ్‌ తెలిపారు. ముఖ్యంగా నీరవ్‌ మోదీ స్కామ్‌ తరవాత జ్యుయలరీ రంగానికి నిధుల జారీపై బ్యాంకులు ఆచితూచి వ్యవహరిస్తున్నాయని ఆయన చెప్పారు.

కంపెనీ విస్తరణ ప్రణాళికల కోసం తమ దగ్గరున్న నగదు నిల్వలతో పాటు అవసరమైతే బ్యాంకు రుణాలు తీసుకుంటామని చెప్పారు. అవసరమైతే బాండ్‌ మార్కెట్‌ను ఆశ్రయిస్తామని తెలిపారు.

రుణ సాయం...
60 బిలియన్‌ డాలర్ల (రూ.3.9 లక్షల కోట్లు) దేశీయ జ్యయలరీ రంగానికి ప్రస్తుతం రుణాలు లభించడం కష్టతరంగా మారింది. మోదీ, చోక్సీల మోసాలు, కఠిన ఆడిటింగ్‌ నేపథ్యంలో రుణాలపై ప్రభావం పడింది. ఏ రంగంలో అయినా భారీ పరిణామం చోటు చేసుకుంటే మందగమనం, గందరగోళం ఏర్పడటం సహజమేనని మలబార్‌ గోల్డ్‌ అండ్‌ డైమండ్స్‌ భారత కార్య కలాపాల ఎండీ ఆషర్‌  పేర్కొన్నారు. ఈ సంస్థ కూడా ఐపీవోకు రావాలనుకుంటోంది.

పరిశ్రమను ఇన్వెస్టర్లు భిన్నమైన కోణంలో చూస్తున్నందున ఐపీవోలకు మార్కెట్‌ సెంటిమెంట్‌ ఆశాజనకంగా లేదని ఆషర్‌ పేర్కొన్నారు. 2022 నాటికి 500 స్టోర్లకు కార్యకలాపాలను విస్తరించనున్నట్టు, ఈ ఏడాదే అమెరికా మార్కెట్లోకి ప్రవేశించనున్నట్టు చెప్పారు. భవిష్యత్తులో ఐపీవో ద్వారా విస్తరణకు అవసరమైన నిధులను సమీకరిస్తామన్నారు. ఈ రంగంలోని పీసీ జ్యుయలర్, త్రిభువన్‌దాస్‌ భీమ్‌జీ జవేరి షేర్లు మోదీ స్కామ్‌ తర్వాత తగ్గిన విషయం తెలిసిందే.  

మరిన్ని వార్తలు