షాకింగ్ : డిఫాల్టర్ల వేలకోట్ల రుణాలు మాఫీ

28 Apr, 2020 17:54 IST|Sakshi

రూ. 68 వేల కోట్ల రుణాలు రద్దు

మాల్యా, చోక్సీ సహా  50 మంది టాప్ విల్‌ఫుల్ డిఫాల్టర్స్ జాబితా

ఆర్టీఐ సమాచారంలో ఆర్‌బీఐ వెల్లడి

సాక్షి, ముంబై: కరోనా వైరస్ సంక్షోభంతో దేశ ఆర్థికవ్యవస్థ తీవ్రమైన మాంద్యంలోకి జారిపోతున్న వేళ రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) షాకింగ్ న్యూస్ చెప్పింది. ఉద్దేశపూర్వక ఎగవేతదారులుగా ప్రకటించిన వ్యాపార వేత్తలకు సంబంధించి రూ. 60వేల కోట్లకుపైగా మాఫీ (రైట్ ఆఫ్) చేసినట్టు వెల్లడించింది. సెప్టెంబర్ 30, 2019 నాటికి బ్యాంకులు 68,000 కోట్ల రూపాయల వరకు రుణాలను  నిలిపి వేసినట్లు సమాచార హక్కు (ఆర్టీఐ) కింద అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పింది. ఆర్టీఐ కార్యకర్త సాకేత్ గోఖలే  తన ట్విటర్ ఖాతాలో  దీనికి సంబంధించిన వివరాలను షేర్ చేశారు. టాప్ 50 ఉద్దేశపూర్వక ఎగవేతదారులపై కాంగ్రెస్ నేత, వాయనాడ్ ఎంపీ రాహుల్‌ గాంధీ లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమాధానం నిరాకరించడంతో తాను ఇదే విషయంపై ఆర్టీఐని ఆశ్రయించినట్టు గోఖలే ట్వీట్ చేశారు. 

ఫిబ్రవరి 16 న టాప్-50 ఉద్దేశపూర్వక ఎగవేతదారులు, వారి ప్రస్తుత రుణ స్థితికి సంబంధించిన వివరాలను కోరగా, ఏప్రిల్ 24న తనకు ఈ సమాధానం వచ్చినట్టు గోఖలే చెప్పారు. టాప్ 50 ఉద్దేశపూర్వక ఎగవేతదారులు చెల్లించాల్సిన మొత్తం రూ .68,607 కోట్లు మాఫీ అయ్యాయని గోఖలే ట్వీట్ చేశారు. వీరిలో పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణంలో ప్రధాన నిందితుడు మెహుల్ చోక్సీ, లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా  తదితరులు ఉన్నారు. ప్రధానంగా ఈ సంస్థల్లో ఆరు డైమండ్ అండ్ జ్యుయల్లరీ సంస్థలు ఉండటం  గమనార్హం.

'విల్‌ఫుల్ డిఫాల్టర్స్' జాబితాలో రుణాలను ఎగవేసి విదేశాలకు పారిపోయిన డైమండ్ వ్యాపారి మెహుల్ చోక్సీకి చెందిన గీతాంజలి జెమ్స్ లిమిటెడ్ రూ.5492 కోట్లతో అగ్రస్థానంలో ఉంది. సందీప్, సంజయ్ ఝున్ ఝన్ వాలాకు  చెందిన  ఎఫ్‌ఎంసిజి సంస్థ  ఆర్‌ఇఐ ఆగ్రో లిమిటెడ్, (రూ. 4314 కోట్లు),  జతిన్ మెహతాకు చెందిన విన్సమ్ డైమండ్స్ అండ్ జ్యువెలరీ లిమిటెడ్ ( రూ.4వేల కోట్లు)  రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. రూ.2,850 కోట్లతో  కాన్పూర్ ఆధారిత కంపెనీ రోటోమాక్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్ ఉంది. వీరితో పాటు బాబా రామ్‌దేవ్ బాలకృష్ణ గ్రూప్ కంపెనీ రుచి సోయా ఇండస్ట్రీస్ లిమిటెడ్, ఇండోర్ (రూ .2,212 కోట్లు) డిఫాల్టర్ల జాబితాలో ఉంది. ఇక రూ.1,943 కోట్ల విజయ్ మాల్యా కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ కూడా ఈ జాబితాలో వుంది. మరోవైపు సుప్రీంకోర్టు తీర్పును ఉటంకిస్తూ విదేశీ రుణగ్రహీతలపై సమాచారాన్ని వెల్లడించడానికి ఆర్‌బీఐ నిరాకరించింది.

మరిన్ని వార్తలు