లాక్‌డౌన్‌తో ఎకానమీ డౌన్‌

13 Apr, 2020 20:53 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి కట్టడికి ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన 21 రోజుల లాక్‌డౌన్‌ దేశ ఆర్థిక వ్యవస్ధపై పెనుప్రభావం చూపింది. ఫ్యాక్టరీలు, వ్యాపారాల మూతతో పాటు.. థియేటర్లు, మాల్స్‌, షాపుల షట్‌డౌన్‌.. విమానాలు, రైళ్లు సహా రవాణా నిలిచిపోవడంతో ఆర్థిక కార్యకలాపాలకు బ్రేక్‌ పడి పెద్దమొత్తంలో లావాదేవీలు స్తంభించాయి. ప్రపంచంలోనే అతిపెద్ద లాక్‌డౌన్‌తో ఈ మూడువారాల్లో భారత ఆర్థిక వ్యవస్థ రూ 7లక్షల కోట్ల నుంచి రూ 8 లక్షల కోట్లను కోల్పోయింది. కరోనా కట్టడికి ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన మేరకు మార్చి 25 నుంచి అమల్లోకి వచ్చిన లాక్‌డౌన్‌తో నిత్యావసరాల సరఫరా మినహా 70 శాతం మేర ఆర్థిక, వాణిజ్య కార్యకలాపాలు నిలిచిపోయాయి.

ఆర్థిక వ్యవస్థ క్రమంగా కోలుకుంటున్న తరుణంలో మహమ్మారి ఎకానమీపై విరుచుకుపడిందని విశ్లేషకులు, పరిశ్రమ సంస్థలు ఆందోళన వ్యక్తం చేశాయి. దేశవ్యాప్త లాక్‌డౌన్‌తో ఆర్థిక వ్యవస్థకు రూ 8 లక్షల కోట్ల వరకూ నష్టం వాటిల్లిందని సెంట్రమ్‌ ఇనిస్టిట్యూషనల్‌ రీసెర్చి అంచనా వేసింది. లాక్‌డౌన్‌తో రోజుకు రూ 35,000 కోట్లకు పైగా నష్టమని, 21 రోజులకు రూ 7.5 లక్షల కోట్ల నష్టం తప్పదని ఎక్యూట్‌ రేటింగ్స్‌ అండ్‌ రీసెర్చ్‌ లిమిటెడ్‌ ఇప్పటికే వెల్లడించింది.‍

చదవండి : లాక్‌డౌన్‌ పక్కాగా అమలు చేస్తే ఇలాగే ఉంటది!

కోవిడ్‌-19 వ్యాప్తితో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ నిర్వీర్యం కావడంతో పాటు భారత్‌లోని పలు ప్రాంతాల్లో మార్చి తొలివారం నుంచే పాక్షిక షట్‌డౌన్‌, మార్చి 25 తర్వాత దేశమంతటా లాక్‌డౌన్‌ అమలు అనివార్యమైందని ఆ సంస్థ పేర్కొంది. లాక్‌డౌన్‌ పొడిగించిన పక్షంలో ఆర్థిక వ్యవస్థ భారీగా దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేసింది. కరోనా మహమ్మారి వ్యాప్తి, లాక్‌డౌన్‌ ప్రభావంతో రవాణా, హోటల్‌, రెస్టారెంట్‌, రియల్‌ఎస్టేట్‌, వినోద రంగం సహా పలు రంగాలు తీవ్రంగా దెబ్బతింటాయని పేర్కొంది.

ఇక లాక్‌డౌన్‌తో దేశవ్యాప్తంగా ట్రక్కులు నిలిచిపోవడంతో ట్రక్కు రవాణా రంగానికి 15 రోజుల లాక్‌డౌన్‌తో రూ 35,200 కోట్ల నష్టం వాటిల్లిందని ఏఐఎంటీసీ ప్రధాన కార్యదర్శి నవీన్‌ గుప్తా వెల్లడించారు. మరోవైపు లాక్‌డౌన్‌తో నిర్మాణ రంగం కుదేలైందని, మహమ్మారి ప్రభావంతో కొనుగోలుదారుల సెంటిమెంట్‌ దెబ్బతినడం..కొనుగోళ్లు నిలిచిపోవడంతో రియల్‌ఎస్టేట్‌ రంగానికి రూ లక్ష కోట్ల నష్టం ఎదురైందని జాతీయ రియల్‌ఎస్టేట్‌ అభివృద్ధి మండలి అధ్యక్షలు నిరంజన్‌ హిరనందాని వెల్లడించారు.

లాక్‌డౌన్‌తో రిటైల్‌ రంగానికి రూ 30,000 కోట్ల పైగా నష్టం వాటిల్లిందని అఖిలభారత వర్తక సమాఖ్య అంచనా వేసింది. మరోవైపు ప్రజల ప్రాణాలతో పాటు ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవడం రెండూ కీలకమైనవని ప్రధాని పేర్కొనడంతో మంగళవారం ఉదయం జాతిని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ చేసే ప్రసంగంపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. లాక్‌డౌన్‌ కొనసాగింపు విధివిధానాలు, మినహాయింపులపై ఎలాంటి ప్రకటన చేస్తారనేది ఉత్కంఠ రేపుతోంది. మరోవైపు పేదలు, వలస కూలీల ప్రయోజనాలు కాపాడుతూనే లాక్‌డౌన్‌ పొడిగింపుపై నిర్ణయం ఉంటుందని భావిస్తున్నారు. చిన్నమధ్యతరహా పరిశ్రమల కార్యకలాపాలకూ మినహాయింపు ఇస్తారని చెబుతున్నారు.

>
మరిన్ని వార్తలు