లోధా డెవలపర్స్‌ రూ.5,500 కోట్ల ఐపీఓ!

27 Apr, 2018 00:01 IST|Sakshi

సెబీకి ఆఫర్‌ పత్రాల దాఖలు...

న్యూఢిల్లీ: రియల్టీ దిగ్గజం లోధా డెవలపర్స్‌ త్వరలో ఐపీఓ(ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌)కు వస్తోంది. ఈ కంపెనీ  ఐపీఓ సంబంధిత పత్రాలను మార్కెట్‌ నియంత్రణ సంస్థ, సెబీకి గురువారం సమర్పించిందని సమాచారం.  ఈ కంపెనీ ఐపీఓ సైజు రూ.5,500 కోట్ల రేంజ్‌లో ఉండొచ్చని అంచనా.  ఈ ఐపీఓలో భాగంగా రూ.3,750 కోట్ల విలువైన తాజా షేర్లతో పాటు ప్రమోటర్లకు చెందిన 1.8 కోట్ల షేర్లను ఆఫర్‌ ఫర్‌ సేల్‌(ఓఎఫ్‌ఎస్‌)విధానంలో జారీ చేస్తారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ప్రి–ఐపీఓ ప్లేస్‌మెంట్‌ విధానంలో 95 లక్షల షేర్ల జారీ ద్వారా రూ.750 కోట్లు సమీకరించే అవకాశాలున్నాయని ఈ వర్గాలు వెల్లడించాయి. ఈ ఏడాది జనవరి నాటికి రూ.18,000 కోట్ల రుణభారం ఈ కంపెనీకి ఉంది. ఈ ఐపీఓ ద్వారా సమీకరించిన నిధులతో రూ.3,300 కోట్ల మేర రుణ భారం తగ్గించుకోవాలని కంపెనీ యోచిస్తోంది.  అయితే ఐపీఓ వార్తలపై వ్యాఖ్యానించడానికి కంపెనీ ప్రతినిధి నిరాకరించారు. 2007లో వచ్చిన రూ.9,000 కోట్ల డీఎల్‌ఎఫ్‌ ఐపీఓ తర్వాత లోధా డెవలపర్స్‌ కంపెనీ ఐపీఓయే రియల్టీ రంగంలో అతి పెద్ద ఐపీఓ కానున్నది.  

2010లో ఆమోదం పొందినా...  
ఈ కంపెనీ ఐపీఓ సంబంధిత పత్రాలను 2009, సెప్టెంబర్‌లో సెబీకి సమర్పించింది. 2010, జనవరిలో సెబీ నుంచి ఆమోదం పొందింది. అయితే అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం కారణంగా స్టాక్‌ మార్కెట్లో అస్తవ్యస్త వాతావరణం నెలకొనడంతో ఐపీఓ ప్రణాళికను అటకెక్కించింది. ఐపీఓ ప్రణాళికను పునరుజ్జీవింపచేయనున్నామని కంపెనీఎమ్‌డీ అభిషేక్‌ లోధా  గతేడాది జూలైలో చెప్పారు. 2018లో లిస్టింగ్‌కు రానున్నామని అప్పుడు ఆయన వెల్లడించారు. ఈ కంపెనీ ప్రస్తుతం హైదరాబాద్, ముంబై, పుణే, బెంగళూరులతో పాటు లండన్‌లో కూడా కార్యకలాపాలు నిర్వహిస్తోంది.  

మరిన్ని వార్తలు