లాజిస్టిక్‌లో 30 లక్షల ఉద్యోగాలు!

20 Jun, 2018 00:23 IST|Sakshi

వచ్చే నాలుగేళ్లలో హైదరాబాద్‌లో 1.96 లక్షల జాబ్స్‌

రూ.14.19 లక్షల కోట్లకు దేశీయ లాజిస్టిక్‌ పరిశ్రమ

నైపుణ్యం కొరత, పని ఒత్తిడి సవాల్‌

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ)తో దేశీయ లాజిస్టిక్‌ రంగంలో పారదర్శకత చేకూరడంతో పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. దీంతో వచ్చే నాలుగేళ్లలో దేశంలోని లాజిస్టిక్‌ రంగంలో కొత్తగా 30 లక్షల ఉద్యోగ అవకాశాలొస్తాయని ప్రముఖ మానవ వనరుల సేవల సంస్థ టీమ్‌లీజ్‌ తెలిపింది. హైదరాబాద్‌లో ఏకంగా 1.96 లక్షల ఉద్యోగాలు వస్తాయని టీమ్‌లీజ్‌ ‘ఇండియన్‌ లాజిస్టిక్‌ రివల్యూషన్‌: బెగ్‌ బెట్స్‌– బిగ్‌ జాబ్స్‌’ నివేదిక వెల్లడించింది.

దీని ప్రకారం... ప్రస్తుతం దేశీయ లాజిస్టిక్‌ విపణి రూ.14.19 లక్షల కోట్లకు చేరిందని.. ఏటా 10.5% వృద్ధిని నమోదు చేస్తుంది. జీఎస్‌టీ, మెరుగైన మౌలిక వసతుల కల్పనే ఈ వృద్ధికి కారణమని టీమ్‌లీజ్‌ అసిస్టెంట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ సుదీప్‌ సేన్‌ తెలిపారు. లాజిస్టిక్‌ రంగ వృద్ధితో ఈ రంగంతో అనుబంధమైన రోడ్డు, రైలు, విమాన, జల రవాణా రంగాలు, గిడ్డంగులు, ప్యాకేజింగ్, కొరియర్‌ విభాగాలు కూడా శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయన్నారు.

ఏ రంగంలో ఎన్నెన్ని ఉద్యోగాలంటే..
2022 నాటికి లాజిస్టిక్‌ రంగం అనుబంధ విభాగాల్లో వచ్చే ఉద్యోగ అవకాశాల గణాంకాలను పరిశీలిస్తే..  ఆర్థిక వృద్ధి, మౌలిక వసతుల్లో పెట్టుబడుల కారణంగా రోడ్డు రవాణాలో 1.45 లక్షలు, కార్గో వృద్ధి కారణంగా విమాన మార్గంలో 26 వేలు, రైలు విభాగంలో 4 వేల ఉద్యోగాలు వస్తాయని నివేదిక వెల్లడించింది.  నగరీకరణ, ప్యాకేజింగ్‌ ఆవిష్కరణలు, ఐటీ స్వీకరణ కారణంగా కొరియర్‌ రంగంలో 11 వేలు, గిడ్డంగుల విభాగంలో 7 వేలు, ప్యాకేజింగ్‌ రంగంలో 3 వేల ఉద్యోగ అవకాశాలుంటాయి.

రూ.6 లక్షల కోట్ల పెట్టుబడులు..
లాజిస్టిక్‌ రంగంలో పబ్లిక్, ప్రైవేట్‌ పెట్టుబడులు గణనీయంగా వస్తున్నాయి. గతేడాది లాజిస్టిక్‌ రంగానికి మౌలిక రంగ హోదా ఇవ్వడంతో రుణాల లభ్యత పెరిగిందని.. దీంతో కొత్త కంపెనీలు, విదేశీ సంస్థలు పబ్లిక్, ప్రైవేట్‌ పెట్టుబడులతో రంగ ప్రవేశం చేస్తున్నాయి.

ఈ రంగంలో రూ.6 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశముంది. దీంతో ఉద్యోగ వృద్ధి గణనీయంగా ఉంటుందని తెలిపింది. 2014లో 54వ ర్యాంక్‌గా ఉన్న లాజిస్టిక్‌ పెర్ఫార్మెన్స్‌ ఇండెక్స్‌ (ఎల్‌పీఐ) ప్రస్తుతం 35కు చేరడమే ఇందుకు ఉదాహరణ. ప్రభుత్వం జల రవాణాపై దృషి, రవాణా కారిడార్లు, లాజిస్టిక్‌ హబ్స్, మల్టీమోడల్‌ లాజిస్టిక్‌ పార్క్‌ల ఏర్పాటు వంటివి కూడా దేశీయ లాజిస్టిక్‌ రంగ వృద్ధికి ప్రధాన కారణం.

శంషాబాద్, మహబూబ్‌నగర్‌ హవా..
దేశీ లాజిస్టిక్‌ రంగంలో వేగంగా వృద్ధి చెందుతున్న మార్కెట్‌ హైదరాబాదే. శంషాబాద్, మహబూబ్‌నగర్‌ ప్రాంతాలు వేర్‌హౌస్‌ కారిడార్లుగా శరవేగంగా వృద్ధి చెందుతున్నాయని నివేదిక తెలిపింది. అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరువగా ఉండటం, భూముల లభ్యత ఎక్కువగా ఉండటం, అద్దెలూ అందుబాటులో ఉండటమే కారణం. రూ.1,930 కోట్ల పెట్టుబడులతో 97 కి.మీ. మేర నాలుగు లైన్ల మోడల్‌ రోడ్‌ కారిడార్లు, మల్టీమోడల్‌ పార్క్‌ల ఏర్పాటు వంటివి రానున్నాయని.. దీంతో హైదరాబాద్‌లో నూతన ఉద్యోగ అవకాశాలున్నాయి.


నైపుణ్య కొరత పెద్ద సవాల్‌..
పాత పని విధానాలు, నైపుణ్యమున్న ఉద్యోగుల కొరత, లింగ వివక్ష వంటివి లాజిస్టిక్‌ రంగానికి ప్రధాన సవాల్‌గా మారాయి. మరోవైపు ఈ రంగంలోని ఉద్యోగులకు పరిహారం, ప్రోత్సాహకాలు తక్కువగా ఉండటం, అధిక పని ఒత్తిడి, శిక్షణ లేమి వంటి రకరకాల కారణాలతో ఉద్యోగులు ఈ రంగం నుంచి వైదొలుగుతున్నారు.

టెక్నాలజీ వినియోగం పెరగడంవల్ల కూడా నైపుణ్య కొరత తీవ్రమైంది. దేశంలోని ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లోనే నైపుణ్యం కొరత ఎక్కువగా ఉందని.. సుమారు నగరంలో 1.18 లక్షల మంది ఉద్యోగులు నైపుణ్యం లేక ఉన్నారని టీమ్‌లీజ్‌ నివేదిక వెల్లడించింది. 2010లో లాజిస్టిక్‌ రంగంలో 5 శాతంగా ఉన్న మహిళా ఉద్యోగుల సంఖ్య ప్రస్తుతం 20%కి పెరిగింది. వచ్చే నాలుగేళ్లలో 26 శాతానికి చేరుతుందని అంచనా వేసింది.  

మరిన్ని వార్తలు