మూలధన బాండ్లకు లోక్‌సభ ఆమోదం 

5 Jan, 2018 00:12 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకులను (పీఎస్‌బీ) గట్టెక్కించే దిశగా బాండ్ల జారీ ద్వారా రూ. 80,000 కోట్ల మేర అదనపు మూలధనాన్ని సమకూర్చే ప్రతిపాదనకు లోక్‌సభ గురువారం ఆమోదముద్ర వేసింది. దీంతోపాటు మరిన్ని సంస్కరణలు కూడా ఉంటాయని ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం.. ఏ బ్యాంకుకు ఎంత ఇవ్వాలి తదితర అంశాలకు సంబంధించి ఆర్థిక సర్వీసుల విభాగం ఇప్పటికే సమగ్రమైన ప్రణాళిక రూపొందించిందని సప్లిమెంటరీ డిమాండ్స్‌ ఫర్‌ గ్రాంట్స్‌ అంశంపై జరిగిన చర్చలో ఆయన వివరించారు. మొండిబాకీలను పెంచుకుంటూ కూర్చున్న పీఎస్‌బీలకు అదనపు మూలధనం సరైనది కాకపోయినప్పటికీ... వాటిని గట్టెక్కించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉన్నందునే ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు.

ఆయా బ్యాంకులు తమ ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చుకునేందుకు, మార్కెట్‌ నుంచి నిధులు సమీకరించుకోగలిగే సత్తాను పెంచుకునేందుకు ఇది ఉపయోగపడగలదని జైట్లీ చెప్పారు. రీక్యాపిటలైజేషన్‌ కింద జారీ చేసే బాండ్లకు ఎస్‌ఎల్‌ఆర్‌ హోదా ఉండదని, ట్రేడింగ్‌కి అనుమతి ఉండదని సంబంధిత వర్గాలు తెలిపాయి. దాదాపు రూ. 7.33 లక్షల కోట్ల మొండిబాకీలతో సతమతమవుతున్న పీఎస్‌బీలను పటిష్టపర్చేందుకు రెండేళ్లలో రూ. 2.11 లక్షల కోట్ల ప్రణాళికను కేంద్రం గత ఆక్టోబర్‌లో ప్రకటించింది. ఇందులో భాగంగా రూ.1.35 లక్షల కోట్ల మేర రీక్యాపిటలైజేషన్‌ బాండ్ల జారీతో పాటు బ్యాంకుల్లో వాటాను విక్రయించడం ద్వారా రూ.58,000 కోట్లు సమకూర్చనుంది. 

మరిన్ని వార్తలు