పెట్రోల్‌, డీజిల్‌ కార్లపై నిషేధం.. కాస్త ముందుగానే

18 Jun, 2018 18:26 IST|Sakshi

గాలి కాల్యుష్యంపై ప్రపంచవ్యాప్తంగా పలు నగరాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. గాలి నాణ్యతను పెంచేందుకు పెట్రోల్‌, డీజిల్‌ కార్లపై నిషేధం కూడా చేపట్టాలని నిర్ణయించాయి. అయితే ఈ నిషేధాన్ని ఇంకా కాస్త ముందుగానే చేపట్టబోతున్నాయి.  కొత్త డీజిల్‌, పెట్రోల్‌ కార్ల విక్రయాలను ముందుగా నిర్ణయించిన దానికంటే 10 ఏళ్లు ముందుగా అంటే 2030 నుంచే నిషేధించబోతున్నట్టు లండన్‌ మేయర్‌ సదిక్‌ ఖాన్‌, బ్రిటన్‌లోని ఇతర నగరాల నేతలు సోమవారం ప్రకటించారు. ప్రధానమంత్రి థెరెస్సా మే కన్జర్వేటివ్‌ ప్రభుత్వం 2040 నుంచి కొత్త పెట్రోల్‌, డీజిల్‌ కార్లపై నిషేధం విధించేందుకు ప్లాన్‌ చేస్తున్నట్టు గతేడాది పేర్కొంది. ప్రస్తుతం ఆ గడువును పదేళ్లు ముందుకు జరిపారు ఈ నేతలు.

అయితే హైబ్రిడ్‌ వాహనాలను కూడా నిషేధిస్తారా? లేదా? అన్నది ఇంకా అస్పష్టంగానే ఉంది. ఖాన్‌తో పాటు ఈ సమావేశంలో పాల్గొన్న వారిలో మాంచెస్టర్‌, లివర్‌పూల్‌, ఆక్స్‌ఫర్డ్‌, షెఫీల్డ్, బ్రిస్టల్ నుంచి వచ్చిన నేతలున్నారు. కొత్త పెట్రోల్‌, డీజిల్‌ కార్ల విక్రయాలపై త్వరగా నిషేధం విధించే విషయంపై సమగ్రంగా చర్చించారు. నగరాల్లో క్లీన్‌ ఎయిర్‌ జోన్స్‌ను అందించడానికి 2030 నుంచే ఈ నిషేధాన్ని చేపట్టాలని నిర్ణయించినట్టు ఖాన్‌ చెప్పారు. అదేవిధంగా నేషనల్‌ వెహికిల్‌ రెన్యూవల్‌ స్కీమ్‌ కూడా గాలి నాణ్యతను, ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని పేర్కొన్నారు.  

మరిన్ని వార్తలు