రాబడులు మెరుగ్గా ఉండాలనుకుంటే...

19 Nov, 2018 00:56 IST|Sakshi

హెచ్‌డీఎఫ్‌సీ టాప్‌ 100

ప్రస్తుతం మార్కెట్లో అస్థిరత నెలకొంది. కొంత ప్రతికూల పరిస్థితులే ఉన్నాయి. ఇలాంటి సమయంలో కూడా మంచి రాబడులు, ప్రతిఫలాన్ని ఆశించే వారు... గతం నుంచీ పనిచేస్తూ పనితీరు పరంగా పేరున్న పథకాలను ఎంచుకోవడం మంచి ఆలోచనే అవుతుంది. అలా చూసినప్పుడు హెచ్‌డీఎఫ్‌సీ టాప్‌–100 ముందు వరుసలో ఉంటుంది.

సెబీ మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాల్లో మార్పులు జరక్కముందు... ఈ ఏడాది మే వరకు హెచ్‌డీఎఫ్‌సీ టాప్‌–200 పేరుతో కొనసాగింది. హెచ్‌డీఎఫ్‌సీ టాప్‌–100 ప్రధానంగా లార్జ్‌క్యాప్‌ స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తుంది. మొత్తం నిధుల్లో 80 శాతాన్ని మార్కెట్‌ విలువ పరంగా అగ్ర స్థానంలో ఉన్న 100 కంపెనీల్లో ఇన్వెస్ట్‌ చేస్తుంది. అందుకే ఆటుపోట్లు ఎదురైన సమయాల్లోనూ పథకం పనితీరు కాస్త మెరుగ్గా ఉంటోంది. ఇతర పథకాలతో పోలిస్తే రిస్క్‌ కాస్త తక్కువే.  

పనితీరు ఎలా ఉందంటే...
లార్జ్‌క్యాప్‌ విభాగంలో హెచ్‌డీఎఫ్‌సీ టాప్‌–100 దీర్ఘకాలంలో టాప్‌ పనితీరును చూపిస్తూ వస్తోంది. గడచిన ఐదేళ్ల కాలంలో చూసుకుంటే వార్షిక రాబడులు 14.5 శాతంగా ఉన్నాయి. ఇదే సమయంలో ఈ కేటగిరీ ప్రామాణిక సూచీ నిఫ్టీ–100 రాబడులు 12.7 శాతమే ఉన్నాయి. మూడేళ్ల కాలంలో చూస్తే మాత్రం ఈ పథకం రాబడులు 8.5 శాతంగా ఉంటే, బెంచ్‌ మార్క్‌ నిఫ్టీ 100 రాబడులు కాస్త అధికంగా 8.7 శాతం చొప్పున ఉన్నాయి.

ఏడాది కాలంలో ఈ పథకం 0.3 శాతం ప్రతికూల రాబడులను ఇచ్చింది. పదేళ్ల కాలంలో చూసుకున్నా ప్రామాణిక సూచీ కంటే ఈ పథకం రాబడులు ఎక్కువే ఉన్నాయి. అంటే దీర్ఘకాలం కోసం ఈ పథకం అనువైనదని భావించొచ్చు. బెంచ్‌ మార్క్‌తో స్వల్ప తేడానే  దీర్ఘకాలంలో పెట్టుబడులపై అధిక రాబడులకు కారణమవుతుందన్న సంగతిని మర్చిపోరాదు. అయితే ఈ పథకం గత పనితీరు భవిష్యత్తు పనితీరుకు హామీ కాదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.  

పెట్టుబడుల విధానం
అధిక నాణ్యతతో కూడిన కంపెనీల్లో ఇన్వెస్ట్‌ చేయడం ఈ పథకం అనుసరించే పెట్టుబడుల విధానంలో భాగం. ఈ పథకం ఎంచుకునే కంపెనీలు కూడా ఆయా రంగాల్లో పెద్ద సంస్థలే. గడ్డు పరిస్థితుల్లోనూ అటువంటి కంపెనీలు ఎదుర్కొని నిలబడగలవు. ముఖ్యంగా ఈ పథకం నిధుల్లో 60 శాతం పది కంపెనీల్లోనే పెట్టుబడిగా పెట్టింది. వీటిలో రిలయన్స్, ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్‌బీఐ తదితర కంపెనీలున్నాయి. పోర్ట్‌ఫోలియో స్టాక్స్‌ వ్యాల్యూషన్లను నిరంతరం గమనిస్తూ సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకోవడాన్ని గమనించొచ్చు.

ఇటీవలి మార్కెట్‌ పతనానికి ముందే మారుతి సుజుకి స్టాక్‌ నుంచి వైదొలగడాన్ని దీనికి నిదర్శనంగా చూడొచ్చు. అలాగే, ఎక్కువగా నష్టపోయిన పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌లో పెట్టుబడులను పెంచుకుంది. ఇక దీర్ఘకాలంగా ప్రభుత్వరంగ స్టాక్స్‌ పట్ల అనుకూలతను కొనసాగిస్తోంది. దీంతో తాజా పతనంలో విలువల పరంగా ఆకర్షణీయంగా ఉన్న కొన్ని ప్రభుత్వరంగ కంపెనీల్లో అదనంగా ఇన్వెస్ట్‌ చేసింది. దాదాపు అన్ని మార్కెట్‌ పరిస్థితుల్లోనూ ఈ పథకం అధిక శాతం నిధులను ఈక్విటీల్లో ఇన్వెస్ట్‌ చేస్తూ కొనసాగుతోంది. అంటే పరిమిత నగదు నిల్వలనే కలిగి ఉంటోంది. పెట్టుబడుల పరంగా బ్యాంకింగ్, సాఫ్ట్‌వేర్‌ రంగాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చింది.

మరిన్ని వార్తలు