ఎన్ఎండీసీ లాభం 59% డౌన్

28 May, 2016 02:46 IST|Sakshi
ఎన్ఎండీసీ లాభం 59% డౌన్

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అమ్మకాల క్షీణత కారణంగా గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ప్రభుత్వ రంగ మైనింగ్ దిగ్గజం ఎన్‌ఎండీసీ నికర లాభం దాదాపు 59 శాతం తగ్గుదలతో రూ. 553 కోట్లకు (స్టాండెలోన్) పరిమితమైంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం క్యూ4లో కంపెనీ లాభం రూ. 1,347 కోట్లు. తాజాగా నాలుగో త్రైమాసికంలో ఆదాయం సుమారు 46 శాతం క్షీణించి రూ. 2,827 కోట్ల నుంచి రూ. 1,530 కోట్లకు తగ్గింది. ఈ వ్యవధిలో మొత్తం వ్యయాలు రూ. 1,435 కోట్ల నుంచి రూ. 1,054 కోట్లకు తగ్గినట్లు కంపెనీ పేర్కొంది.

మరోవైపు, పూర్తి ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆదాయం రూ. 12,356 కోట్ల నుంచి రూ. 6,456 కోట్లకు తగ్గగా, లాభం సైతం రూ. 6,422 కోట్ల నుంచి రూ. 3,028 కోట్లకు క్షీణించింది. మరోవైపు, ముడి ఇనుము అమ్మకాలు, సరఫరా కోసం మరో ప్రభుత్వ రంగ ఉక్కు దిగ్గజం సెయిల్‌తో కలిసి జాయింట్ వెంచర్ సంస్థను ఏర్పాటు చేసినట్లు ఎన్‌ఎండీసీ వెల్లడించింది. ఇందులో ఎన్‌ఎండీసీకి 51%, సెయిల్‌కు 49% వాటాలు ఉంటాయి. శుక్రవారం బీఎస్‌ఈలో కంపెనీ షేరు 1.2% పెరిగి రూ. 92.50 వద్ద ముగిసింది.

 సువెన్ లైఫ్ లాభం రూ. 33 కోట్లు
బయోఫార్మా సంస్థ సువెన్ లైఫ్ నికర లాభం క్యూ4లో సుమారు 88 శాతం వృద్ధితో రూ. 17 కోట్ల నుంచి రూ. 32 కోట్లకు పెరిగింది. ఆదాయం రూ.111 కోట్ల నుంచి రూ. 169 కోట్లకు చేరినట్లు సంస్థ పేర్కొంది. మరోవైపు పూర్తి ఆర్థిక సంవత్సరంలో ఆదాయం సుమారు 4 శాతం తగ్గి రూ. 520 కోట్ల నుంచి రూ. 500 కోట్లకు పరిమితమైంది. లాభం 13 శాతం క్షీణతతో రూ. 109 కోట్ల నుంచి రూ. 95 కోట్లకు తగ్గింది. పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలపై రూ. 63 కోట్లు వెచ్చించినట్లు సంస్థ వివరించింది.

మరిన్ని వార్తలు