అత్యుత్తమ కంపెనీ... ‘ఎల్‌ అండ్‌ టీ’

17 Oct, 2018 00:24 IST|Sakshi

పనిచేయదగ్గ కంపెనీలతో ఫోర్బ్స్‌ జాబితా

2వేల కంపెనీల్లో దీనికి 22వ స్థానం

ముంబై: ప్రపంచవ్యాప్తంగా ఉన్న 2,000 ‘బెస్ట్‌ గ్లోబల్‌ ఎంప్లాయర్స్‌’ కంపెనీల జాబితాను ఫోర్బ్స్‌ రూపొందించగా... దేశీ మౌలిక రంగ దిగ్గజం లార్సెన్‌ అండ్‌ టూబ్రో (ఎల్‌ అండ్‌ టీ) ఈ జాబితాలో 22వ స్థానంలో నిలిచింది. 2018 ఏడాదికి రూపొందించిన జాబితాలో మొత్తం 4,30,000 కంపెనీలను పరిశీలించిన ఫోర్బ్స్‌.. వీటిలో అత్యంత ఉత్తమమైన ఎంప్లాయర్స్‌గా 2వేల కంపెనీలను ఎంపికచేసింది. ఈ జాబితాలో వందలోపు ర్యాంకులను పొందిన భారత కంపెనీలలో ఎల్‌ అండ్‌ టీ 22వ స్థానంలో నిలవగా.. మహీంద్రా అండ్‌ మహీంద్ర (55)వ స్థానం, గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌ (59), హెచ్‌డీఎఫ్‌సీ (91)వ స్థానాల్లో నిలిచాయి.

మొత్తం 24 దేశీ కంపెనీలకు జాబితాలో స్థానం దక్కింది. వంద తరువాత స్థానాల్లో వరుసగా.. ప్రభుత్వ రంగ సంస్థ జీఐసీ (106), ఐటీసీ (108), సెయిల్‌ (139), సన్‌ ఫార్మా (172), ఏషియన్‌ పెయింట్స్‌ (179), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ (183), అదానీ పోర్ట్స్‌ అండ్‌ స్పెషల్‌ ఎకనామిక్‌ జోన్‌ (201), జెఎస్‌డబ్ల్యూ స్టీల్‌ (207), కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ (253), హీరో మోటోకార్ప్‌ (295), టెక్‌ మహీంద్రా (351), ఐసీఐసీఐ బ్యాంక్‌ (359), విప్రో (362), హిందాల్కో (378), స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (381), బజాజ్‌ ఆటో (417), టాటా మోటార్స్‌ (437), పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (479), యాక్సిస్‌ బ్యాంక్‌ (481), ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌ (489) స్థానంలో నిలిచాయి.  

టాప్‌ 10లో ఆరు అమెరికావే!!
జాబితాలోని మొదటి 10 కంపెనీలలో ఆరు అమెరికన్‌ కంపెనీలు ఉండగా.. గూగుల్‌ మాతృసంస్థ ఆల్ఫాబెట్‌ టాప్‌ వన్‌లో నిలిచింది. మైక్రోసాఫ్ట్‌ 2వ స్థానాన్ని సొంతం చేసుకుంది. ఆపిల్‌ (3), వాల్ట్‌ డిస్నీ (4), అమెజాన్‌ (5), సెల్‌జీన్‌ కార్పొరేషన్‌ 9వ స్థానంలో నిలిచాయి. తొలి 500 కంపెనీలలో 185 యూఎస్‌ సంస్థలు ఉండగా.. ఆ తరువాత అత్యధిక కంపెనీలు జర్మనీవే. టాప్‌ టెన్‌లో సైతం జర్మనీకి చెందిన ఆటో దిగ్గజం దైమ్లర్‌ (7), బీఎండబ్ల్యూ (10) స్థానంలో నిలిచాయి. ఇక ఈ జాబితాలో చైనా, హాంకాంగ్‌కు చెందినవి 80 కంపెనీలున్నాయి.

మరిన్ని వార్తలు