ఉపాధికి ఊతం.. బిగ్‌ డేటా

9 Aug, 2017 00:35 IST|Sakshi
ఉపాధికి ఊతం.. బిగ్‌ డేటా

చిన్న వ్యాపారుల రుణ లభ్యతకు కీలకం
తద్వారా ఉద్యోగాల కల్పన, ఆర్థిక వృద్ధికి తోడ్పాటు
నందన్‌ నీలేకని  


బెంగళూరు: ఉపాధి కల్పన, ఆర్థిక వృద్ధిపరమైన సమస్యలకు బిగ్‌ డేటానే పరిష్కారమని ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు నందన్‌ నీలేకని చెప్పారు. ఇప్పటిదాకా రుణాలు సరిగ్గా దొరకక ఇబ్బంది పడుతున్న చిన్న వ్యాపారాలకు కూడా దీంతో తోడ్పాటు లభించగలదని పరిశ్రమల సమాఖ్య సీఐఐ నిర్వహించిన సదస్సులో ఆయన వ్యాఖ్యానించారు. ‘బిగ్‌ డేటా అనేది ఏదో అర్థం కాని సాంకేతిక పదమో, గిమ్మిక్కో కాదు. ఇది వాస్తవానికి దేశంలోని చిన్న వ్యాపార సంస్థల పెట్టుబడి ప్రక్రియకు, వృద్ధికి తోడ్పడుతోంది. ఇవి అంతిమంగా ఆర్థిక వృద్ధికి, ఉపాధి కల్పనకు దోహదపడతాయి‘ అని ఆయన చెప్పారు. వస్తు, సేవల పన్నుల విధానం జీఎస్‌టీ అమల్లోకి రావడంతో వ్యాపార సంస్థలకు సంబంధించిన కీలక గణాంకాలు అందుబాటులోకి వస్తున్నాయని నీలేకని తెలిపారు.

‘జీఎస్‌టీ పరిధిలోని దాదాపు ఎనభై లక్షల పైగా చిన్న వ్యాపార సంస్థలకు క్రమంగా రుణాలు లభించడం మొదలవుతుంది. ఆయా వ్యాపార సంస్థలు.. రుణ సదుపాయం అందుబాటులోకి వచ్చాక మరింత వృద్ధి చెందుతాయి.. తదనుగుణంగా ఉద్యోగాల కల్పన కూడా జరుగుతుంది‘ అని చెప్పారు. వ్యాపారాల పనితీరుకు సంబంధించి సరైన డేటా లేకనే చిన్న వ్యాపార సంస్థలకు రుణాలు లభించడం కష్టమవుతోందని నీలేకని చెప్పారు. మరోవైపు, మొండి బాకీల అంశంపై స్పందిస్తూ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ సారథ్యంలోని ఆర్‌బీఐ ఈ సమస్య పరిష్కారానికి చెప్పుకోతగ్గ ప్రయత్నమే చేస్తోందని ఆయన పేర్కొన్నారు.

ఐఐఎం పరీక్ష రాయకపోవడం మంచిదైంది..
ఐఐఎం ప్రవేశ పరీక్ష రాయకపోవడం తన అదృష్టమని లేకపోతే.. తాను ఇన్ఫీ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తితో కలిసి పనిచేసే అవకాశం కోల్పోయి ఉండేవాడినని నీలేకని వ్యాఖ్యానించారు. అప్పట్లో ఆ పరీక్ష రాసి ఉండి ఉంటే ప్రస్తుతం ఏ సబ్బుల కంపెనీలోనో మరో దాన్లోనో మేనేజరుగా స్థిరపడిపోయి ఉండేవాడినని ఆయన చమత్కరించారు. ‘ఐఐఎం ప్రవేశ పరీక్షను మిస్‌ కావడం నా అదృష్టం. అప్పట్లో నేను ఉద్యోగం వెదుకుతూ ఓ చిన్న కంపెనీకి వెళితే అక్కడ నారాయణ మూర్తి నాకు ఆఫర్‌ ఇచ్చారు. ఆ తర్వాత మా అనుబంధం మరింత బలపడింది.. అదే ఇన్ఫోసిస్‌ ఆవిర్భావానికి దారి తీసింది. ఆ తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలుసు. ఒకవేళ నేను గానీ ఎంట్రన్స్‌ ఎగ్జామ్స్‌ రాసి ఉంటే ఇన్ఫీలో భాగమయ్యే వాణ్ని కాను. అదృష్టవశాత్తూ అంతకన్నా ముందుగానే నేను ఇన్ఫోసిస్‌లో చేరాను‘ అని నీలేకని చెప్పారు. ఐఐటీలో విద్యాభ్యాసం, అక్కడి పరిస్థితులు తనలో ఆత్మవిశ్వాసం పెంపొందించాయని, నాయకుడిగా ఆలోచన ధోరణిని మార్చుకోవడానికి తోడ్పడ్డాయని ఆయన వివరించారు.

మరిన్ని వార్తలు