పెద్ద కార్ల రేట్లకు రెక్కలు

8 Aug, 2017 00:43 IST|Sakshi
పెద్ద కార్ల రేట్లకు రెక్కలు

25 శాతానికి పెరగనున్న సెస్సు  
పెంపు ప్రతిపాదనకు జీఎస్‌టీ కౌన్సిల్‌ ఆమోదం  
ఆందోళనలో కార్ల కంపెనీలు


న్యూఢిల్లీ: గత నెల 1న వస్తు, సేవల పన్నుల (జీఎస్‌టీ) విధానం అమల్లోకి వచ్చినప్పట్నుంచీ ఖరీదైన లగ్జరీ కార్ల రేట్లు తాత్కాలికంగా కాస్త తగ్గినా.. తాజాగా మళ్లీ పెరగనున్నాయి. ఈ దిశగా పెద్దకార్లపై సెస్సును 25 శాతానికి పెంచాలన్న ప్రతిపాదనకు జీఎస్‌టీ కౌన్సిల్‌ ఆమోదముద్ర వేసింది. జీఎస్‌టీ అమల్లోకి వచ్చిన తర్వాత ప్రస్తుతం కార్లు అత్యధిక శ్లాబ్‌ రేటు 28 శాతం పరిధిలోకి రాగా, అదనంగా 1–15 శాతం దాకా సెస్సు ఉంటోంది. వస్తు, సేవల పన్నుల విధానం అమల్లోకి వచ్చాక గత విధానంలో కన్నా  వాహనాలపై మొత్తం పన్ను భారం తగ్గడంతో .. ఆగస్టు 5న జరిగిన 20వ సమావేశంలో ఈ అంశాన్ని జీఎస్‌టీ కౌన్సిల్‌ పరిశీలించినట్లు కేంద్ర ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

8702, 8703 విభాగాల కిందకి వచ్చే వాహనాలపై గరిష్ట సెస్సును ప్రస్తుతమున్న 15 శాతం నుంచి 25 శాతానికి పెంచే దిశగా కేంద్ర ప్రభుత్వం తగు చట్ట సవరణలు చేయొచ్చంటూ కౌన్సిల్‌ సిఫార్సు చేసినట్లు ఆర్థిక శాఖ వివరించింది. అయితే పెంపు ఎప్పట్నుంచి విధించేదీ జీఎస్‌టీ కౌన్సిల్‌ నిర్ణయిస్తుందని పేర్కొంది. కార్లు, పొగాకు, బొగ్గు మొదలైన వాటిపై వసూలు చేసే సెస్సును .. జీఎస్‌టీ వల్ల రాష్ట్రాలకు వాటిల్లే ఆదాయనష్టాన్ని భర్తీ చేసేందుకు కేంద్రం ప్రభుత్వం వినియోగిస్తోంది. ఇందుకోసం గరిష్ట సెస్సు రేటును నిర్దేశించే ప్రత్యేక చట్టాన్నీ రూపొందించింది. తాజాగా సెస్సు రేటును సవరించాలంటే.. సదరు చట్టానికి సవరణలు చేయాల్సి ఉంటుంది.

పెద్ద కార్లు, ఎస్‌యూవీలు..
8702, 8703 హెడింగ్స్‌ కింద వర్గీకరించిన వాహనాల్లో మధ్య స్థాయి, పెద్ద కార్లు, స్పోర్ట్స్‌ యుటిలిటీ వాహనాలు (ఎస్‌యూవీ), సంఖ్యాపరంగా పది మంది కన్నా ఎక్కువ.. 13 కన్నా తక్కువ మంది ప్రయాణించగలిగే వాహనాలు ఉన్నాయి. అలాగే 1500 సీసీ పైబడిన హైబ్రీడ్‌ కార్లు కూడా ఈ విభాగం పరిధిలోకి వస్తాయి. చాలా మటుకు కార్లకు 28 శాతం గరిష్ట పన్ను పరిధిలో ఉన్నప్పటికీ, పెద్ద వాహనాలు, ఎస్‌యూవీలు, హైబ్రీడ్‌ కార్లు మొదలైన వాటికి అదనంగా మరో 15 శాతం సెస్సు ఉంటోంది. 4 మీటర్ల కన్నా తక్కువ పొడవు, 1200 సీసీ సామర్థ్యం గల చిన్న పెట్రోల్‌ కార్లపై సెస్సు 1 శాతంగా ఉండగా, అదే పొడవుతో 1500 సీసీ సామర్థ్య మున్న చిన్న డీజిల్‌ కార్లపై సెస్సు 3 శాతంగా ఉంటోంది.

జీఎస్‌టీ అమల్లోకి రావడానికి ముందు... మోటారు వాహనాలపై గరిష్ట పన్ను 52–54.72 శాతం స్థాయిలో ఉండేది. సీఎస్‌టీ, ఆక్ట్రాయ్‌ మొదలైన వాటికి సంబంధించి మరో 2.5 శాతం దీనికి తోడయ్యేది. అయితే, జీఎస్‌టీ వచ్చిన తర్వాత మొత్తం పన్ను పరిమితి 43 శాతానికి తగ్గింది. దీంతో చాలా మటుకు కంపెనీలు తమ ఎస్‌యూవీల రేట్లను రూ. 1.1 లక్షల నుంచి రూ. 3 లక్షల దాకా తగ్గించాయి. అయితే, గత విధానం తరహాలోనే ఈ పరిమితిని కొనసాగించేందుకు ప్రస్తుతం గరిష్టంగా ఉన్న 28 శాతం జీఎస్‌టీకి మరో 25 శాతం సెస్సును జోడించాల్సిన అవసరం ఉందని జీఎస్‌టీ కౌన్సిల్‌ భావించి తాజా నిర్ణయం తీసుకుంది.

ఇలాగైతే విస్తరణ ప్రణాళికలకు విఘాతం..
పెద్ద కార్లు, ఎస్‌యూవీలపై సెస్సు పెంపు ప్రతిపాదనపై వాహన తయారీ సంస్థలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. జీఎస్‌టీ తర్వాత చౌకగా మారిన పెద్ద కార్ల రేట్లు మళ్లీ పెరిగేలా సెస్సు విధించే ప్రతిపాదన పరిశ్రమ సెంటిమెంటును దెబ్బతీస్తుందని టయోటా కిర్లోస్కర్‌ మోటార్, మెర్సిడెస్‌ బెంజ్, ఆడి, బీఎండబ్ల్యూ తదితర సంస్థలు ఆందోళన వ్యక్తం చేశాయి.  స్పందనలు ఇలా...

‘దీన్ని బట్టి చూస్తుంటే ఆర్థిక వృద్ధికి ఆటోమొబైల్‌ రంగం తోడ్పాటుపై ప్రభుత్వం అంత ఆసక్తిగా లేదన్నట్లుగా సంకేతాలు కనిపిస్తున్నాయి‘ అని టయోటా కిర్లోస్కర్‌ మోటార్‌ వైస్‌ చైర్మన్‌ శేఖర్‌ విశ్వనాథన్‌ చెప్పారు.

‘లగ్జరీ కార్ల తయారీ దిగ్గజమైన మా కంపెనీ.. మేకిన్‌ ఇండియా కార్యక్రమం కింద తలపెట్టిన భవిష్యత్‌ విస్తరణ ప్రణాళికలపై ఇలాంటివి ప్రతికూల ప్రభావం చూపుతాయి‘ అని మెర్సిడెస్‌ బెంజ్‌ ఇండియా ఎండీ రోలాండ్‌ ఫోల్గర్‌ పేర్కొన్నారు.

తప్పనిసరిగా తమ వ్యాపార ప్రణాళికలను పునఃసమీక్షించుకోవాల్సి ఉందని ఆడి ఇండియా హెడ్‌ రాహిల్‌ అన్సారీ చెప్పారు. సెస్సు పెంపు నిర్ణయం కంపెనీలు, డీలర్లు, కస్టమర్లతో పాటు ఆటోమొబైల్‌ పరిశ్రమలో పనిచేసే ఉద్యోగులు, కార్మికులపైనా ప్రతికూల ప్రభావం తప్పదన్నారు.

తక్షణమే ఇలా సెస్సులను మార్చేస్తుండటం.. భారత్‌లో ఆటోమోటివ్‌ పరిశ్రమ వృద్ధికి విఘాతం కలిగిస్తుందని బీఎండబ్ల్యూ గ్రూప్‌ ఇండియా ప్రెసిడెంట్‌ విక్రమ్‌ అభిప్రాయపడ్డారు.

మరిన్ని వార్తలు