మహీంద్రా.. రెక్స్‌టన్ ఆర్‌ఎక్స్6

6 May, 2014 00:47 IST|Sakshi
మహీంద్రా.. రెక్స్‌టన్ ఆర్‌ఎక్స్6

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన కంపెనీ మహీంద్రా అండ్ మహీంద్రా సోమవారమిక్కడ భారత మార్కెట్లో సాంగ్‌యాంగ్ రెక్స్‌టన్ ఆర్‌ఎక్స్6 మోడల్‌ను ఆవిష్కరించింది. 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో విలాసవంతమైన ఫీచర్లతో ఈ ఖరీదైన వాహనాన్ని రూపొందించింది. హైదరాబాద్ ఎక్స్‌షోరూంలో ధర రూ.20.11 లక్షలు. ముందువైపు, ఇరు పక్కల కూడా ఎయిర్‌బ్యాగ్స్‌ను ఉంచారు. మలుపుల్లో, అలాగే కొండ ప్రాంతాల్లో వాహనం జారకుండా స్థిరంగా ఉండేలా వ్యవస్థ ఉంది. ప్రీమియం లెదర్‌తో ఇంటీరియన్‌ను తీర్చిదిద్దారు. టిల్ట్, ఓపెన్ ఫంక్షన్‌తో ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్స్‌ను అమర్చారు. నాలుగు రంగుల్లో లభిస్తుంది. ఇప్పటికే రెక్స్‌టన్ నుంచి ఆటో ట్రాన్స్‌మిషన్‌తో ఆర్‌ఎక్స్7 (రూ.21.28 లక్షలు), మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో ఆర్‌ఎక్స్5 (రూ.19 లక్షలు) మోడళ్లున్నాయి. ఈ రెండు మోడళ్లలో లేని 17 రకాల ఫీచర్లను ఆర్‌ఎక్స్6లో పొందుపరిచారు.

 మరో ఆరు ఇంజిన్లపై..
 సాంగ్‌యాంగ్‌తో కలిసి ఆరు ఇంజిన్ల తయారీలో నిమగ్నమైనట్టు మహీంద్రా అండ్ మహీంద్రా ఆటోమోటివ్ విభాగం సేల్స్ చీఫ్ అరుణ్ మల్హోత్రా ఈ సందర్భంగా తెలిపారు. వీటిని రెండు కంపెనీలూ వినియోగిస్తాయని, మూడేళ్లలో సిద్ధమవుతాయని చెప్పారు. హై ఎండ్, లగ్జరీ ఫీచర్లతో మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ మోడల్‌ను వినియోగదారులు కోరుతున్నందునే ఆర్‌ఎక్స్6ను విడుదల చేసినట్టు పేర్కొన్నారు. హై స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాల పరిమాణం దేశంలో 2013-14లో 23,665 యూనిట్లు నమోదైంది. అంత క్రితం ఆర్థిక సంవత్సరంలో ఈ సంఖ్య 26,208 యూనిట్లు. ఈ విభాగంలో మహీంద్రా రెండో స్థానంలో ఉంది.

మరిన్ని వార్తలు