మహీంద్రా సీఐఈ చేతికి ఔరంగాబాద్‌ ఎలక్ట్రికల్స్‌ 

13 Mar, 2019 00:25 IST|Sakshi

డీల్‌ విలువ రూ.876 కోట్లు

న్యూఢిల్లీ: ఔరంగాబాద్‌ ఎలక్ట్రికల్స్‌ కంపెనీని(ఏఈఎల్‌) వాహన విడిభాగాల సంస్థ, మహీంద్రా సీఐఈ కొనుగోలు చేయనుంది. ఈ డీల్‌కు డైరెక్టర్ల బోర్డ్‌ ఆమోదం తెలిపిందని మహీంద్రా సీఐఈ వెల్లడించింది. ఔరంగాబాద్‌ ఎలక్ట్రికల్స్‌లో మొత్తం వాటాను రూ.876 కోట్లకు కొనుగోలు చేయనున్నట్లు కంపెనీ సీఈఓ అండెర్‌ అరెనాజ తెలిపారు. ఈ కంపెనీ కొనుగోలుతో తాము అల్యూమినియం డై కాస్టింగ్‌ టెక్నాలజీ రంగంలోకి ప్రవేశిస్తామని చెప్పారాయన. వచ్చే నెల 10లోపు ఈ డీల్‌ పూర్తవ్వగలదని అంచనా. కాగా, ఎమ్‌సీఐఈ, సీఐఈలతో భాగస్వామ్యం తమ కంపెనీకి మంచి జోరునిస్తుందని ఏఈఎల్‌  సీఎండీ రిషి బగ్లా చెప్పారు. 

1985లో ప్రారంభమైన ఔరంగాబాద్‌ ఎలక్ట్రికల్స్‌ కంపెనీ అల్యూమినియం డై–కాస్టింగ్‌ రంగంలో అగ్రస్థానంలో ఉంది. ఈ కంపెనీకి ఔరంగాబాద్, పుణే, పంత్‌నగర్‌లలో ఐదు ప్లాంట్లున్నాయి. వీటిలో మొత్తం 3,300 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వార్షిక విక్రయాలు రూ.850 కోట్ల మేర ఉన్నాయి. ఇక స్పెయిన్‌కు చెందిన సీఐఈ ఆటోమోటివ్‌లో భాగమైన మహీంద్రా సీఐఈలో మహీంద్రా గ్రూప్‌నకు 11.5 శాతం వాటా ఉంది. 

మరిన్ని వార్తలు