మహింద్రా లైఫ్‌స్పేస్‌  లాభం 35 శాతం డౌన్‌ 

23 Apr, 2019 01:01 IST|Sakshi

 ఒక్కో షేరుకు రూ.6 డివిడెండ్‌

న్యూఢిల్లీ: రియల్‌ ఎస్టేట్‌ సంస్థ మహింద్రా లైఫ్‌స్పేస్‌ డెవలపర్స్‌ కన్సాలిడేటెడ్‌ లాభం మార్చి త్రైమాసికంలో 35 శాతం తగ్గిపోయింది. రూ.31.27 కోట్ల లాభాన్ని ఆర్జించింది. అమ్మకాల ఆదాయం రూ.247 కోట్లుగా నమోదైంది. కిందటేడాది ఇదే కాలంలో నికర లాభం రూ.47.75 కోట్లుగా ఉంటే, ఆదాయం రూ.180 కోట్లు కావడం గమనార్హం. 2018–19 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో రూ.1,023 కోట్ల సేల్స్‌ బుకింగ్స్‌ జరిగినట్టు కంపెనీ ప్రకటించింది. 2018–19 పూర్తి ఆర్థిక సంవత్సరానికి కంపెనీ నికర లాభం అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ఉన్న రూ.101 కోట్ల నుంచి రూ.120 కోట్లకు వృద్ధి చెందింది.

ఆదాయం సైతం రూ.644 కోట్ల నుంచి రూ.654 కోట్లకు పెరిగింది. ‘‘నివాసిత గృహాల విక్రయాల్లో తొలిసారి రూ.1,000 కోట్ల మార్క్‌ను అధిగమించాం. గత గరిష్ట రికార్డు రూ.800 కోట్లు’’ అని కంపెనీ ఎండీ, సీఈవో సంగీతా ప్రసాద్‌ తెలిపారు. ఒక్కో షేరుకు రూ.6 చొప్పున 2018–19 సంవత్సరానికి డివిడెండ్‌ ఇవ్వాలని కంపెనీ డైరెక్టర్ల బోర్డు నిర్ణయించింది.    

మరిన్ని వార్తలు