మెప్పించని మహీంద్రా

5 Aug, 2017 00:52 IST|Sakshi
మెప్పించని మహీంద్రా

►  జూన్‌ క్వార్టర్‌ లాభం రూ.766 కోట్లు
► 20 శాతం క్షీణత; ఆదాయం 3.29 శాతం వృద్ధి


ముంబై: ఆటోమొబైల్‌ రంగంలోని ప్రముఖ కంపెనీ మహీంద్రా అండ్‌ మహీంద్రా జూన్‌ త్రైమాసిక ఫలితాలు నిరాశపరిచాయి. స్టాండ్‌ అలోన్‌ ప్రాతిపదికన కంపెనీ రూ.766 కోట్ల లాభాన్ని ఆర్జించింది. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో వచ్చిన లాభం రూ.955 కోట్లతో పోల్చి చూస్తే 20 శాతం తగ్గింది. ఆదాయం మాత్రం 3.29 శాతం వృద్ధితో రూ.12,335 కోట్లుగా నమోదైంది. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో ఆదాయం రూ.11,942 కోట్లు. వాహనాల విక్రయాలు 1,12,293గా ఉన్నాయి. 81,270 ట్రాక్టర్ల అమ్మకాలు జరిగాయి.

జీఎస్టీకి మారడం వల్ల ఆ ప్రభావం ఆటోమొబైల్‌ రంగంపై పడినట్టు ఎం అండ్‌ ఎం తెలిపింది. కొత్త పన్ను వ్యవస్థలో ధరలు తగ్గుతాయన్న అంచనాల ప్రభావం పాసింజర్‌ వాహనాలపై పడడంతో విక్రయాల్లో వృద్ధి 4.4 శాతానికే పరిమితమైనట్టు వివరించింది. ఇక బీఎస్‌–4 అమల్లోకి రావడానికి ముందు బీఎస్‌–3 వాహనాలను మార్చి క్వార్టర్లో కొనుగోలు చేయడం వల్ల, జూన్‌ త్రైమాసికంలో భారీ వాణిజ్య వాహనాల విక్రయాలు తగ్గినట్టు తెలిపింది.

మంచి వర్షపాత అంచనాలతో ఏప్రిల్, మే నెలల్లో ట్రాక్టర్ల విక్రయాల్లో వృద్ధి నెలకొనగా, జీఎస్టీ అనిశ్చితి కారణంగా జూన్‌లో 1.7 శాతం తగ్గాయని పేర్కొంది. మొత్తం మీద పరిశ్రమ వ్యాప్తంగా ట్రాక్టర్ల విక్రయాలు 8.5 శాతం పెరగ్గా, దీనికంటే అధికంగా ఎంఅండ్‌ఎం 13.2 శాతం వృద్ధిని నమోదు చేసినట్టు తెలిపింది. ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో స్టాక్‌ ధర శుక్రవారం 1.11 శాతం తగ్గి రూ.1,401.15 వద్ద క్లోజయింది.

మరిన్ని వార్తలు