మహీంద్రా మినీ ట్రక్ ‘జీతో’

23 Jun, 2015 23:59 IST|Sakshi
మహీంద్రా మినీ ట్రక్ ‘జీతో’

♦ 8 రకాల వేరియంట్లలో తయారీ
♦ ధర రూ.2.32-2.77 లక్షలు
♦ జహీరాబాద్ ప్లాంటులో అభివృద్ధి
 
 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో/సంగారెడ్డి టౌన్ : వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా ‘జీతో’ పేరుతో చిన్న ట్రక్‌ను మెదక్ జిల్లా జహీరాబాద్ ప్లాంటులో మంగళవారం ఆవిష్కరించింది. ఎం-డ్యూరా డీజిల్ ఇంజన్‌ను దీనికి పొందుపరిచారు. 600, 700 కిలోల బరువు మోయగల సామర్థ్యం ఉంది. మొత్తం 8 రకాల వేరియంట్లను రూపొందించారు. ఇన్ని వేరియంట్లతో భారత్‌లో వచ్చిన చిన్న వాణిజ్య వాహనం ఇదే.

కావాల్సిన రీతిలో బాడీని మలిచే వీలుండడం ప్రత్యేకత. మైలేజీ లీటరుకు 27.8-37.6 కిలోమీటర్లని కంపెనీ తెలిపింది. వేరియంట్‌ని బట్టి ధర తెలంగాణలోని ఎక్స్‌షోరూంలో రూ.2.32 లక్షల నుంచి రూ.2.77 లక్షల వరకు ఉంది. జహీరాబాద్ ప్లాంటు విస్తరణకు కంపెనీ రూ.250 కోట్లు వెచ్చించింది. జీతో అభివృద్ధికి రూ.50 కోట్లు ఖర్చు చేశారు. ప్లాంటులో ఏటా 1.5 లక్షల యూనిట్ల వరకు జీతో మోడళ్లను తయారు చేసే వీలుంది. బీఎస్ 3, బీఎస్ 4 మోడల్స్ అందుబాటులో ఉన్నాయి.

 ప్యాసింజర్ వెహికిల్ కూడా..
 జీతో ప్లాట్‌ఫామ్‌పై ప్యాసింజర్ వాహనాన్ని ఏడాదిలో ప్రవేశపెడతామని మహీంద్రా ఈడీ పవన్ గోయెంకా వెల్లడించారు. కంపెనీ ఆటోమోటివ్ విభాగం ప్రెసిడెంట్ ప్రవీణ్ షాతో కలిసి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. చిన్న వాణిజ్య వాహన రంగంలో జీతో సంచలనం సృష్టిస్తుందన్నారు. అయిదేళ్ల తర్వాత కొత్త ప్లాట్‌ఫాంపై వచ్చిన వాహనం జీతో అని తెలిపారు. ఏటా ఒక కొత్త ట్రాక్టర్ మోడల్‌ను ప్రవేశపెడతామని వెల్లడించారు.

ఈ ఏడాదే ఏడు కొత్త ప్లాట్‌ఫామ్స్ ఆవిష్కరిస్తామన్నారు. ‘చిన్న వాణిజ్య వాహనాల విపణిలో ఈ ఏడాది 5-7 శాతం వృద్ధి ఆశిస్తున్నాం. మొత్తంగా వాహన పరిశ్రమలో తిరోగమన వృద్ధి కాలం పూర్తి అయింది. ఇక పరిశ్రమ వృద్ధి బాటన పడుతుంది. దేశీయంగా పెట్టుబడి సెంటిమెంటు బలపడుతోంది. అటు రుతుపవనాలు సైతం అనుకూలంగా ఉంటాయి’ అని తెలిపారు. శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్‌లకు జీతో వాహనాలను కంపెనీ ఎగుమతి చేయనుంది.

మరిన్ని వార్తలు