మార్కెట్లోకి మైక్రోపోర్ట్‌ వైద్య పరికరాలు

29 Jul, 2017 00:39 IST|Sakshi
మార్కెట్లోకి మైక్రోపోర్ట్‌ వైద్య పరికరాలు

► దశలవారీగా ఉత్పత్తుల  విడుదల
► మైక్రోపోర్ట్‌ ఇండియా ఎండీ రియాజ్‌ దేశాయ్‌


హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: వైద్య పరికరాల తయారీలో ఉన్న చైనా కంపెనీ మైక్రోపోర్ట్‌ భారత్‌లో పాగాకు కసరత్తు ప్రారంభించింది. స్టెంట్లు, మోకాలి శస్త్ర చికిత్స పరికరాలను ఇక్కడి మార్కెట్లో  విడుదల చేసిన ఈ కంపెనీ పలు దేశాల్లో 5,000పైగా ఆసుపత్రుల్లో 200ల దాకా ఉత్పత్తులను విక్రయిస్తోంది.

వీటన్నిటినీ మూడేళ్లలో భారత్‌లో ప్రవేశపెడతామని మైక్రోపోర్ట్‌ ఇండియా ఎండీ రియాజ్‌ దేశాయ్‌ శుక్రవారమిక్కడ మీడియాకు తెలిపారు. అత్యాధునిక పరికరాలను అందుబాటు ధరలో విక్రయించాలన్న లక్ష్యంతో దేశీయ మార్కెట్లో అడుగు పెట్టినట్టు చెప్పారు. టార్గెట్‌ ఎల్యూటింగ్‌ స్టెంట్‌ను భారత్‌లో రూ.30 వేలకే విక్రయిస్తున్నామని, విదేశాల్లో దీని ధర రూ.1.3 లక్షల దాకా ఉందన్నారు. రూ.20 వేల ధరలో టార్గెట్‌ ఎల్యూటింగ్‌ స్టెంట్‌ తయారీకి ప్రణాళిక సిద్ధం చేశామన్నారు.      
     
భారత్‌లో తయారీ..
భారత ప్లాంటును 18–24 నెలల్లో పూర్తి చేస్తామని, ఎంతైనా పెట్టుబడికి సిద్ధమని చెప్పారు. ‘చైనా, భారత్‌లే రానున్న రోజుల్లో మార్కెట్‌ను నడిపిస్తాయి. స్టెంట్ల వినియోగం ఈ రెండు దేశాల్లో 18 శాతం వార్షిక వృద్ధి నమోదు చేస్తోంది. యూఎస్‌లో 10 లక్షలు, చైనాలో 7 లక్షలు, భారత్‌లో 5 లక్షల యూనిట్లు ఏటా అమ్ముడవుతున్నాయి. వాస్తవానికి భారత్‌లో 40 లక్షల స్టెంట్లు అవసరం. అత్యధిక రోగులు బీమా లేకపోవడం, ఖర్చు పెట్టే స్తోమత లేక సంప్రదాయ చికిత్సల వైపు మొగ్గుతున్నారు’ అని ఈ సందర్భంగా ఆయన వివరించారు.

మరిన్ని వార్తలు