హైదరాబాద్‌లో గృహ నిర్మాణాలు ఆలస్యం

19 Oct, 2019 00:01 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దేశీయ రియల్‌ ఎస్టేట్‌ రంగంలో నివాస విభాగం అత్యంత గడ్డు పరిస్థితుల్లో ఉంది. ఢిల్లీ, ఎన్‌సీఆర్, పుణే, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా వంటి ఏడు ప్రధాన నగరాల్లో గృహ నిర్మాణాలు ఆలస్యంగా కొనసాగుతున్నాయి. ఎగువ మధ్య తరగతి, ప్రీమియం విభాగాల ప్రాజెక్ట్స్‌ల్లో మాత్రమే ఈ జాప్యం ఉందని జేఎల్‌ఎల్‌ రీసెర్చ్‌ నివేదిక తెలిపింది.

► గృహ నిర్మాణాలను ప్రారంభించిన కాలం నుంచి ఐదేళ్ల కాల పరిమితిని దాటిన ప్రాజెక్ట్‌లను నిర్మాణ గడువు ముగిసిన/ ఆగిపోయిన ప్రాజెక్ట్‌లుగా జేఎల్‌ఎల్‌ రీసెర్చ్‌ పరిగణించింది. ఈ లెక్కన చూస్తే దేశంలో 2014 లేదా అంతకంటే ముందు ప్రారంభమై నేటికీ పూర్తి కానివి మొత్తం 4.54 లక్షల గృహాలున్నాయి. వీటి విలువ రూ.4.62 లక్షల కోట్లు. వీటిల్లో ఢిల్లీ–ఎన్‌సీఆర్‌లో 62 శాతం, ముంబైలో 22 శాతం గృహాలున్నాయి. ఆయా నగరాల్లో ప్రతి మూడు గృహాల్లో ఒకటి నిర్మాణ గడువు ముగిసిందే ఉంది.

► నగరాల వారీగా జాప్యమైన గృహాల సంఖ్య చూస్తే.. హైదరాబాద్‌లో 2,400 గృహాలు (0.5 శాతం), బెంగళూరులో 28,400 (6.3 శాతం), చెన్నైలో 8,500 (1.9 శాతం), కోల్‌కతాలో 17,800 (3.9 శాతం), పుణేలో 16,400 గృహాలు (3.6 శాతంగా ఉన్నాయి.

నగరంలో అద్దెవాసులే ఎక్కువ
2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలోని పట్టణ ప్రాంతాల్లో 1.19 కోట్ల గృహాలు ఖాళీగా ఉన్నాయి. తక్కువ అద్దెలు, సరిగా లేని నిర్వహణ, అద్దెదారుల బాధ్యతారాహిత్యం, అద్దె గృహాల రాయితీలు లేకపోవటం వంటి రకరకాల కారణాలతో రెంట్‌ హౌస్‌లు వేకెంట్‌గా ఉంటున్నాయని నైట్‌ఫ్రాంక్‌ ఇండియా, కైటాన్‌ అండ్‌ కో సంయుక్త నివేదిక తెలిపింది.

► దేశ జనాభాలో 2.73 కోట్ల కుటుంబాలు అద్దె గృహాల్లో నివాసముంటున్నాయి. 79.4 శాతం అంటే 2.17 కోట్ల కుటుంబాలు పట్టణ ప్రాంతాల్లోనే రెంట్‌కు ఉంటున్నాయి. అత్యధిక అద్దె కుటుంబాలు తమిళనాడులో ఉన్నాయి. ఇక్కడ 35,90,179 మంది అద్దె గృహాల్లో ఉంటున్నారు. రెండో స్థానంలో సంయుక్త ఆంధ్రప్రదేశ్‌ ఉంది. ఇక్కడ 3,004,702 కుటుంబాలు రెంట్‌ హౌస్‌లలో ఉంటున్నాయి. హైదరాబాద్‌ వాటా 6 శాతంగా ఉంది.

► మహారాష్ట్రలో 29,40,731, కర్నాటకలో 24,47,718, గుజరాత్‌లో 13,15,157, వెస్ట్‌ బెంగాల్‌లో 12,92,263, ఉత్తర ప్రదేశ్‌లో 11,14,832, ఢిల్లీలో 9,29,112 అద్దె గృహాలున్నాయి.

మరిన్ని వార్తలు