బంగారం ఉండగా..  చింత ఎందుకు దండగ!

28 Jun, 2020 07:28 IST|Sakshi

ఆర్థిక ఇబ్బందులకు గోల్డ్‌లోన్లతో చెక్

 బ్యాంకుల్లో సగటున 38% పెరిగిన వైనం

బంగారం రుణంపై పరిమితిని పెంచిన ఆర్‌బీఐ

గ్రాముపై రూ.2,200 నుంచి రూ.3,200కు పెంపు

పరిమితి పెంపుతో 85 శాతం రుణాలు రెన్యువల్‌

సాక్షి, హైదరాబాద్‌ : వరుసగా మూడు నెలల లాక్‌డౌన్‌తో అన్ని రంగాలూ ఆర్థిక సంక్షోభంలో పడ్డాయి. ఫలితంగా ప్రైవేటు ఉద్యోగాలు చేసే వారికి ఇబ్బందులు తీవ్రమయ్యాయి. ఈ పరిస్థితుల్లో ప్రైవేటు అప్పు పుట్టడం మరింత కష్టమైంది. ఆర్థిక సమస్యల నుంచి బయటపడేందుకు మెజార్టీ కుటుంబాలు బంగారు రుణాలవైపు మొగ్గు చూపుతున్నాయి. ప్రైవేటు బ్యాంకుల వైపు కాకుండా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో తక్కువ వడ్డీ ఉండటం, నిబంధనలు సైతం సంతృప్తికరంగా ఉండటంతో రుణాలు పొందాలనుకుంటున్న 90 శాతం మంది జాతీయ బ్యాంకులవైపే పరుగులు పెడుతున్నారు.

అరగంటలో బంగారు రుణం..
కోవిడ్‌-19 పరిస్థితుల్లో రిజర్వ్‌ బ్యాంక్‌ అత్యధిక రుణాలు ఇచ్చేలా బ్యాంకులను ఆదేశించింది. వాస్తవ ప్రణాళికతో పాటు కోవిడ్‌-19 ప్రొగ్రామ్‌ కింద బంగారు రుణాలను ఇబ్బడిముబ్బడిగానే ఇస్తున్నాయి. ఇతర రుణాలతో పోలిస్తే బంగారంపై రుణాల మంజూరీ బ్యాంకులకు లాభాన్ని చేకూర్చేవే.. దీంతో వీటిపై పెద్దగా షరతులు లేకుండా రుణాలు ఇస్తున్నాయి. సగటున ఒక బ్యాంకులో బంగారు రుణం పొందేందుకు అరగంట నుంచి గంట సమయంలో మంజూరవుతోంది. జాతీయ బ్యాంకుల్లో బంగారు రుణంపై వడ్డీ 85 పైసల్లోపే ఉంటుంది. అయితే బంగారు రుణంపై ముందుగా బ్యాంకర్‌కు సమాచారమిస్తే టోకెన్లు జారీ చేస్తూ వాటి ఆధారంగా రుణాలు ఇస్తున్నారు. బ్యాంకుల్లో భౌతిక దూరం పాటించే క్రమంలో టోకెన్లు ఇస్తున్నట్లు బ్యాంకర్లు చెబుతున్నారు.

38 శాతం పెరుగుదల..
ప్రస్తుత పరిస్థితుల్లో ఎక్కువమంది బంగారు రుణాల తాకట్టు వైపు చూస్తున్నారు. ఇప్పట్లో కరోనా వైరస్‌ వ్యాప్తి తగ్గేలా లేదు. దీంతో శుభకార్యాలు, పెళ్ళిళ్లు జరిగే అవకాశం తక్కువగా ఉండటం, ఒకవేళ ఈ కార్యక్రమాలు జరిగినప్పటికీ పెద్ద సంఖ్యలో జనాలు హాజరయ్యే పరిస్థితి కనిపించడం లేదు. దానికి తోడు ఎక్కువగా నగలు వేసుకుని వెళ్లే వేడుకల హాజరుకు మెజారిటీ జనం జంకుతున్నారు. ఈ సమయంలో బంగారం ఇళ్లలో ఉండటం కంటే బ్యాంకుల్లో ఉంటే భద్రత ఉంటుందనే భావన.. దానికి తోడు ఆర్థిక అవసరాలను సైతం అధిగమించవచ్చనే ఆలోచనతో బంగారు రుణాలవైపు మొగ్గు చూపుతున్నారు. 3 నెలల్లో బంగారు రుణాలు తీసుకునే వారి సంఖ్య 38% పెరిగినట్లు ఓ అధికారి తెలిపారు. గతంలో రోజుకు సగటున ఒక బ్యాంకులో 6-10 మందికి కొత్తగా బ్యాంకు రుణాలిస్తుండగా.. ప్రస్తుతం ఆ సంఖ్య 8-12కు పెరిగిందని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా సీనియర్‌ మేనేజర్‌ పాతూరి వెంకటేశ్‌గౌడ్‌ ‘సాక్షి’తో అన్నారు.

రెన్యువల్స్‌ జోరు..
బంగారు ఆభరణాలపై రుణ పరిమితి పెరిగింది. ఇదివరకు గ్రాము బంగారంపై రూ.2,200 వరకు రుణం ఇవ్వగా.. ప్రస్తుతం ఈ పరిమితిని రూ.3,200కు పెంచుతూ ఆర్‌బీఐ నిర్ణయించింది. దీంతో ఇదివరకే బ్యాంకు రుణాలు తీసుకున్న వారు.. ఆ ఖాతాను రెన్యువల్‌ చేసుకుంటూ అదనపు రుణాన్ని పొందుతున్నట్లు బ్యాంకర్లు చెబుతున్నారు. బంగారు రుణం గడువు గరిష్టంగా 12 నెలల కాల పరిమితి ఉంటుంది, ఈక్రమంలో కాలపరిమితి ముగిసిన వారు సైతం తిరిగి రెన్యువల్‌కే ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రస్తుతం ఉన్న గోల్డ్‌ లోన్లలో 85 శాతం రెన్యువల్‌ చేసుకుని తిరిగి అదనపు రుణాన్ని పొందినట్లు రంగారెడ్డి జిల్లా తుర్కయాంజాల్‌ బీఓబీ మేనేజర్‌ ఒకరు వ్యాఖ్యానించారు. 

లాక్‌డౌన్‌ కారణంగా రెండు నెలలుగా వేతనం అందలేదు. ప్రస్తుతం లాక్‌డౌన్‌ సడలింపులతో ఉద్యోగంలో చేరినప్పటికీ వచ్చే వేతనంతో ఆర్థిక సమస్యలు తీరేలా లేవు. దీంతో కొత్తగా అప్పులు చేస్తే వడ్డీ భారం తలకు మించినట్లవుతుందని భావించి బంగారు రుణం కోసం బ్యాంకును ఆశ్రయించాడు. గంటసేపట్లో రూ.60 వేల రుణం 72 పైసల వడ్డీకే పొందాడు. ఆర్థిక సమస్యలను అధిగమిస్తూ వాయిదాల పద్ధతిలో బంగారు రుణాన్ని చెల్లించేలా కార్యాచరణ సిద్ధం చేసుకున్నాడు.
-అనిల్‌కుమార్‌ ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగి  

>
మరిన్ని వార్తలు