ప్రపంచ మార్కెట్టే లక్ష్యం కాకూడదు

29 May, 2015 01:36 IST|Sakshi
ప్రపంచ మార్కెట్టే లక్ష్యం కాకూడదు

‘మేక్ ఇన్ ఇండియా’పై రాజన్ అభిప్రాయం
శ్రీనగర్: కేంద్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమంపై తన అభిప్రాయాన్ని రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) గవర్నర్ రఘురామ్ రాజన్ మరోసారి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రపంచ మార్కెట్ మాత్రమే లక్ష్యం కాకూడదని అన్నారు.  కశ్మీర్‌లో రెండు రోజుల పర్యటన జరుపుతున్న రాజన్, ఇక్కడ ఒక బిజినెస్ స్కూల్‌లో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.  ప్రపంచ తయారీ పరిశ్రమకు భారత్ కేంద్రం కావాలని,  పెరుగుతున్న జనాభాకు తద్వారా ఉపాధి అవకాశాలు పెరగాలని ప్రధాన లక్ష్యంగా గత ఏడాది సెప్టెంబర్‌లో ప్రధాని నరేంద్రమోదీ మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ కార్యక్రమంపై రాజన్ తన అభిప్రాయాలను విద్యార్థులతో పంచుకున్నారు. ఆయన ఏమన్నారంటే...
భారత్‌లో తయారీ రంగం పురోభివృద్ధి సాధించాలన్న లక్ష్యంతో ప్రారంభించిన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం ఎంతో విలువైనది అనడంలో సందేహం లేదు. అయితే ప్రపంచ మార్కెట్ మాత్రమే ఈ కార్యక్రమానికి లక్ష్యం కాకూడదు.
ప్రపంచ మార్కెట్‌లో సత్తా చాటడానికి మనం తగిన ప్రయత్నం చేయాల్సిందే. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. ప్రపంచ ఆర్థికాభివృద్ధి మందగమనంలో ఉంది. భారీ డిమాండ్ లేదు. ఈ అంశాలన్నింటినీ భారత్ పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రపంచ మార్కెట్ మాత్రమే లక్ష్యంగా ఉంటే కొన్ని ఇబ్బందులు తలెత్తవచ్చు.
తయారీ, సేవల రంగం వృద్ధికి మౌలిక అలాగే నియంత్రణాపరమైన తగిన వాతావరణాన్ని  దేశం లో ఏర్పాటు చేయాలి.  ఆయా అంశాలూ ఉపాధి అవకాశాలు పెరగడానికి దోహదపడతాయి.
ఎవరికోసం ఉత్పత్తి జరుగుతోందన్న అంశాన్ని మనం నిర్ణయించుకోకూడదు. ఇక్కడ ప్రధానంగా మనం తయారీ రంగం వృద్ధికి అవసరమైన మౌలిక పరిస్థితులు రూపకల్పన, వ్యాపారాలు తేలిగ్గా చేసుకునేలా నియమ నిబంధనల్లో సవరణలు, సుశిక్షుతులైన మానవ వనరుల అభివృద్ధి కీలకం.

మరిన్ని వార్తలు