ఈ ఏడాదే వన్‌ప్లస్...మేక్ ఇన్ ఇండియా మొబైల్

10 Aug, 2015 01:43 IST|Sakshi
ఈ ఏడాదే వన్‌ప్లస్...మేక్ ఇన్ ఇండియా మొబైల్

వన్‌ప్లస్ ఇండియా జీఎం వికాస్ అగర్వాల్
- వన్‌ప్లస్-2 మొబైల్‌కు 32 లక్షల మంది నమోదు
- ఆఫ్‌లైన్ మార్కెట్లోకి ప్రవేశించేందుకు సిద్ధమే...

‘నెవర్ సెటిల్’ నినాదంతో ఆన్‌లైన్లో హైఎండ్ ఫీచర్ ఫోన్లను ప్రవేశపెట్టి ఆకట్టుకున్న ‘వన్ ప్లస్’ సంస్థ.. ఈ ఏడాదే మేక్ ఇన్ ఇండియా ఫోన్లను తీసుకురానుంది. చైనాకు చెందిన ఈ స్టార్టప్ కంపెనీ... ఇక్కడ ప్లాంటు పెట్టే ఆలోచనలేవీ చేయకుండా కాంట్రాక్టు ఒప్పందం కుదుర్చుకునే ప్రయత్నాల్లో ఉంది. ఇందుకోసం ఫాక్స్‌కాన్ తదితర సంస్థలతో చర్చిస్తోంది. అయితే ఏ కంపెనీతోనూ ఇంకా ఒప్పందం ఖరారు కాలేదని ‘వన్‌ప్లస్’ ఇండియా జీఎం వికాస్ అగర్వాల్ చెప్పారు. మేక్ ఇన్ ఇండియా ఫోన్‌ను ఈ ఏడాదిలోనే తీసుకురావాలన్నది తమ లక్ష్యమన్నారు. ఈ నెల 11 నుంచి అందుబాటులోకి రానున్న తమ ఫ్లాగ్ షిప్ మోడల్ ‘వన్‌ప్లస్-2’ను పరిచయం చేసేందుకు ఆదివారం హైదరాబాద్‌లో కంపెనీ పాప్ అప్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా  సాక్షి బిజినెస్ బ్యూరో ప్రతినిధికిచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు అంశాలు వెల్లడించారు. అవి...

వన్‌ప్లస్-2పై మీకు అంచనాలు చాలా ఎక్కువే ఉన్నట్లున్నాయి. నెరవేరుతాయని అనుకుంటున్నారా?
వన్‌ప్లస్-2 కొత్త మొబైల్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 32 లక్షల మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఇందులో 30-40 శాతం మంది భారత్ నుంచి ఉన్నారు.

మరిన్ని మోడల్స్ తెస్తున్నారా?
వన్‌ప్లస్ నుంచి మూడవ మోడల్ కూడా ఈ ఏడాదే వస్తోంది. ఇది వన్‌ప్లస్-2 స్థాయిలో ఉండకపోవచ్చు. అలాగే వన్‌ప్లస్-2 మోడల్‌లో 16 జీబీ వేరియంట్ కూడా తీసుకొస్తున్నాం. భారత్‌లో 2015లో అన్ని మోడళ్లు కలిపి 10 లక్షల యూనిట్లు విక్రయించాలన్నది లక్ష్యం. తద్వారా సంస్థకు ప్రపంచంలో టాప్-1 మార్కెట్‌గా భారత్‌ను నిలుపుతాం.

ఒకవేళ మీ ఫోను పాడైతే మరమ్మతుల మాటేంటి? సర్వీసింగ్ ఉందా?
మాకు మొత్తం 60 సర్వీసింగ్ కేంద్రాలున్నాయి. హైదరాబాద్‌లో 3 ఏర్పాటు చేశాం. ఆఫ్‌లైన్‌లోకి రావాలన్న ఆలోచన ఉంది. మరీ ఎక్కువ లాభాలను ఆశించకుండా ముందుకు వచ్చే రిటైల్ కంపెనీలతో చేతులు కలుపుతాం.
 
ఇన్విటేషన్ విధానాన్ని ఎందుకు అనుసరిస్తున్నారు?
మా తయారీ సామర్థ్యం పరిమితం. అందుకే ఇన్విటేషన్ విధానం ద్వారా మోడళ్లను విక్రయిస్తున్నాం. దానివల్ల సరుకు నిల్వ చేయాల్సిన అవసరం ఉండదు. డిమాండ్‌ను బట్టే ఉత్పత్తి చేయవచ్చు.
 
వన్‌ప్లస్ వన్ ఎన్ని అమ్ముడయ్యాయి?
వన్‌ప్లస్ వన్ మోడల్ ఫోన్లు ఇప్పటి వరకు 35 దేశాల్లో 15 లక్షల వరకు అమ్ముడయ్యాయి. ఇందులో భారత్ వాటా 2.5 లక్షల యూనిట్లు. విక్రయాల పరంగా యూఎస్, ఈయూ, భారత్ టాప్-3 దేశాలు. రెండేళ్లపాటు లాభాలకు దూరంగా ఉండాలని మా మాతృృ సంస్థ నిర్ణయించింది. అందుకే దిగ్గజ కంపెనీల మోడళ్లతో పోలిస్తే సగం ధరకే మోడళ్లను విక్రయించగలుగుతున్నాం. కస్టమర్ల సూచనలే మోడళ్ల రూపకల్పనకు ఆధారం. ప్రపంచవ్యాప్తంగా మోడళ్ల ధర ఒకేలా ఉంటుంది.
 
మీ సిబ్బంది ఎంతమంది?
అన్ని దేశాల్లో కలిపి సంస్థ మా కంపెనీ ఉద్యోగుల సంఖ్య 100లోపే.

మరిన్ని వార్తలు