మాల్దీవుల ఎయిర్‌పోర్ట్ రద్దు కేసులో జీఎంఆర్ విజయం

20 Jun, 2014 01:12 IST|Sakshi
మాల్దీవుల ఎయిర్‌పోర్ట్ రద్దు కేసులో జీఎంఆర్ విజయం
  •   ఏకపక్ష రద్దును తప్పుపట్టిన ట్రిబ్యునల్
  •   నష్టపరిహారంతో పాటు, కోర్టు ఖర్చులు చెల్లించాలని ఆదేశం
  •  హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జీఎంఆర్ గ్రూపు దక్కించుకున్న మాల్దీవుల్లోని మాలే ఎయిర్‌పోర్ట్ అభివృద్ధి, నిర్వహణ కాంట్రాక్టును ఏకపక్షంగా రద్దు చేయడంపై మాల్దీవుల ప్రభుత్వాన్ని, మాల్దీవుల ఎయిర్‌పోర్ట్ కంపెనీ(ఎంఏసీఎల్)లను ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ తప్పుపట్టింది. అర్ధంతరంగా కాంట్రాక్టును రద్దు చేసినందుకుగాను జరిగిన నష్టానికి పరిహారం చెల్లించడమే కాకుండా కోర్టు ఖర్చుల కింద 4 మిలియన్ డాలర్లు (రూ.24 కోట్లు) చెల్లించాలని లార్డ్ హాఫ్‌మన్ నేతృత్వంలోని అంతర్జాతీయ వాణిజ్య వివాద పరిష్కార ట్రిబ్యునల్ తీర్పునిచ్చింది.
     
    ఈ ఖర్చుల్ని 42 రోజుల్లో చెల్లించాలని ఆదేశించింది. మాలేలోని ఇబ్రహిం నసిర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ను అభివృద్ధి చేసి నిర్వహించే కాంట్రాక్టును 500 మిలియన్ డాలర్లకు మాల్దీవుల ప్రభుత్వం, ఎంఏసీఎల్ నుంచి జీఎంఆర్ గ్రూపు 2010లో దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఈ కాంట్రాక్టు కేటాయింపులో గత ప్రభుత్వం అవకతవకలకు పాల్పడిందంటూ రద్దు చేసింది. ఇలా ఏకపక్షంగా కాంట్రాక్టును రద్దు చేయడంపై జీఎంఆర్ 1.4 బిలియన్ డాలర్ల నష్టపరిహారాన్ని కోరుతూ కోర్టుకు ఎక్కింది. ఈ ఒప్పందం చెల్లదంటూ మాల్దీ వుల ప్రభుత్వం అంతర్జాతీయ ఆర్బిట్రేటర్ ముందుకు వెళ్లింది.
     
    సింగపూర్‌లోని హాఫ్‌మన్ ట్రిబ్యునల్ ఆర్బిట్రేషన్ విచారణ నవంబర్ 29, 2012లో  మొదలు కాగా 18 నెలల తర్వాత జీఎంఆర్‌కి అనుకూలంగా తీర్పు వచ్చింది. ప్రస్తుత విచారణలో కాంట్రాక్టు రద్దు చేయడం తప్పని తేలిందని, ఇక జరిగిన నష్టంపై ఎంత చెల్లించాలన్నదానిపై తదుపరి విచారణ జరగాల్సి ఉం దని జీఎంఆర్ ప్రతినిధి వ్యాఖ్యానించారు. జీఎంఆర్ కోరుతున్న రూ.8,000 కోట్ల పరిహారం లభించకపోవ చ్చని, ఇది రూ.2,000-3,000 కోట్ల మధ్య ఉండొచ్చని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. ఈ వార్తలతో గురువారం జీఎంఆర్ ఇన్‌ఫ్రా షేరు భారీ ట్రేడింగ్ పరిమాణంతో రూ.32,85 వద్ద స్థిరంగా ముగిసింది.

మరిన్ని వార్తలు