కార్పొరేట్లపై ‘మాల్యా’ మరక తగదు...

26 Mar, 2016 00:51 IST|Sakshi
కార్పొరేట్లపై ‘మాల్యా’ మరక తగదు...

కేంద్ర వాణిజ్య మంత్రి నిర్మలా సీతారామన్
న్యూఢిల్లీ: కార్పొరేట్లలో ఘనత వహించినవారెందరో ఉన్నారని.. అయితే, అందరినీ  బకాయిలు ఎగవేసిన విజయ్ మాల్యా వంటి వారి గాటన కట్టకూడదని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం పేర్కొన్నారు. ఆమె ఈ మేరకు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘కార్పొరేట్ల అనుచిత అంశాలు ఒక్క భారత్‌లోనే కాదు. ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకుంటున్నాయి. అయితే భారత్‌లో దేశీయ, అంతర్జాతీయ కంపెనీల మంచి పనితీరును మాల్యా  వంటి అంశాలతో కప్పివేయడం సరికాదని అన్నారు. విజయ్ మాల్యా ఘటన భారత్ పట్ల ఇన్వెస్టర్లలో ప్రతికూల భావనలను లేవనెత్తుతుందా?

అన్న ప్రశ్నకు ఆమె సమాధానం చెబుతూ, ఇలాంటి పరిస్థితి ఉండబోదని తాము భావిస్తున్నామన్నారు. భారత్ ఈ తరహా అంశాల నుంచి పాఠాలు నేర్చుకుందని, భవిష్యత్తులో ఇలాంటి పరిణామాలు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. మాల్యా గ్రూప్ కంపెనీ 17 బ్యాంకుల నుంచి రూ.9,000 కోట్లు రుణాలు తీసుకుంది. ఉద్దేశపూర్వక ఎగవేతదారుగా విమర్శలను ఎదుర్కొంటున్న మాల్యా... మార్చి 4న దేశం వదలి వెళ్లారు. ప్రస్తుతం బ్రిటన్‌లో ఉన్నట్లు సమాచారం. పలు విచారణా సంస్థలు ఆయన కంపెనీల ఆర్థిక లావాదేవీలపై విచారణ జరుపుతున్నాయి.

మరిన్ని వార్తలు