క్లిక్స్ తెచ్చిన తంటా : అనుకోకుండా 28 కా(సా)ర్లు

29 Jun, 2020 14:53 IST|Sakshi
ఫైల్ ఫోటో

బిల్లు చూసి  గుడ్లు తేలేసిన కస్టమర్

సాక్షి, న్యూఢిల్లీ: టెస్లా కార్లు అంటేనే ఆధునిక టెక్నాలజీకి, విలాసానికి పెట్టింది పేరు. అలాంటిది జర్మనీకి చెందిన ఒక వ్యక్తి ఏకంగా ఒకేసారి 28 టెస్లా కార్లను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేశాడు. ఆ తరువాత పొరబాటు తెలుసుకుని లబోదిబోమన్నాడు.  

రెడ్డిట్ సమాచారం ప్రకారం తమ పాత ఫోర్డ్ కుగాను జర్మన్ కు చెందిన వ్యక్తి, అతని తండ్రి ఆటో పైలట్‌ టెస్లా మోడల్ 3  కారును కొనుగోలు చేయాలని భావించారు.  అన్ని వివరాలను నింపి కస్టమర్  చివరికి 'కన్ఫర్మ్' బటన్‌ను పదేపదే నొక్కేశాడు. దీంతో  ప్రతి క్లిక్‌తో మొత్తం 28 ఆర్డర్లు ఫైనల్ అయిపోయాయి.  ఫలితంగా 28 టెస్లా కార్లకు 1.4 మిలియన్ యూరోలు (సుమారు 11.9 కోట్ల రూపాయలు) బిల్లు చూసి కళ్లు తేలేసాడు. అంతేకాదు  ప్రతి ఆర్డర్‌కు కనీసం 100 యూరోల చొప్పున  నో రీఫండ్ ఫీజుగా 2,800 యూరోలు కూడా అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. దీంతో  బెంబేలెత్తిన సదరు వినియోగదారుడు కంపెనీని ఆశ్రయించాడు.

టెస్లా వెబ్‌సైట్‌లో సాంకేతిక లోపం కారణంగాఈ పరిణామం చోటు చేసుకుందని రెడ్డిట్ నివేదించింది. చివరికి ఎటువంటి ఛార్జీ లేకుండా మొత్తం ఆర్డర్‌ను టెస్లా రద్దు చేసింది. మరోసారి కొనుగోలుకు ప్రయత్నించాలని కోరింది. దీంతో జర్మన్ వ్యక్తి ఊపిరి పీల్చుకున్నాడు.

మరిన్ని వార్తలు