చివరకు పవర్‌ బ్యాంకును కూడా..

1 Feb, 2018 19:44 IST|Sakshi

సాక్షి,  ముంబై:  అతి విలువైన బంగారం అక్రమ రవాణాలో  వింతపోకడలు  పోలీసులు సైతం విస్తుపోయేలా చేస్తున్నాయి. టెక్నాలజీకి తగ్గట్టుగా ట్రెండ్ మారుస్తున్న అక్రమార్కులు  టెక్నాలజీ  బాగా వాడేస్తున్నారు.  తాజాగా ఏకంగా స్మార్ట్‌ఫోన్‌ ఛార్జింగ్‌నకు ఉపయోగించే పవర్‌బ్యాంక్‌ను ఎంచుకున్నారు. ఇందులో  గోల్డ్‌ బార్స్‌ను  చాకచక్యంగా దాచిపెట్టి తప్పించుకోవాలని ప్రయత్నించారు.  కానీ, చివరకు నిఘా అధికారులకు చిక్కక తప్పలేదు.

పవర్ బ్యాంక్‌లో గోల్డ్ బార్స్‌ను పెట్టి అక్రమంగా తరలిస్తున్న వ్యక్తిని ముంబై ఎయిర్‌పోర్ట్‌లో సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. 600 గ్రాముల బంగారం బార్లను పవర్ బ్యాంకులో తరలిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసిన సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది వాటిని స్వాధీనం చేసుకొని అతడిని కస్టమ్ అధికారులకు అప్పగించారు. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ దాదాపు 18 లక్షలు ఉంటుందని అధికారులు వెల్లడించారు.
 
మరో కేసులో 24 లక్షల రూపాయల విలువ చేసే బంగారాన్ని అధికారులు పట్టుకున్నారు. దుబాయ్ నుంచి కొచ్చికి వచ్చిన సిద్ధిఖి వెల్లై మీరన్‌ ఖాదర్ మొహిదీన్ నుంచి సుమారు  800వందల గ్రాముల పసిడిని నిఘా అధికారులు స్వాధీనం చేసుకున్నారు.   అండర్‌ గార్మెంట్స్‌లో దాచి పెట్టి అక్రమంగా రవాణా చేస్తుండగా పట్టుకున్నామని దీని విలువ రూ.24.36 లక్షలని కస్టమ్స్ కమిషనర్ సుమిత్ కుమార్  వెల్లడించారు. నిందితుడిని అరెస్ట్‌  చేశామని తెలిపారు.

>
మరిన్ని వార్తలు