నీటిలో మహింద్రా వాహనం, ఆనంద్‌ స్పందన

27 Jun, 2018 12:32 IST|Sakshi

ఇటీవల దేశవ్యాప్తంగా భారీ వర్షాలు నగరాలను ముంచెత్తుతున్నాయి. ఈ వర్షాల్లో బయటికి వాహనాలు రావాలంటే, వాహనదారులకు నరకమే కనిపిస్తోంది. ఇక నీళ్లలో కూరుకుపోయిన వాహనాలను, వాటి నుంచి బయట పడేయడం ప్రాణం మీదకు వస్తోంది. కానీ మహింద్రా టీయూవీ 300 మాత్రం నదులా పారుతున్న నీటిలో కూడా అలవోకగా ప్రయాణిస్తుందట. ఈ విషయాన్ని ఆ వాహనం నడుపుతున్న వాహనదారే చెప్పాడు. 4 అడుగుల లోతైన వరద నీటిలో కూడా తన వెహికిల్‌ చాలా బాగా పనిచేస్తుందంటు మహింద్రా టీయూవీ 300 వాహనదారి చెప్పాడు. ఈ విషయాన్ని కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ ఆనంద్‌ మహింద్రాకు తెలుపుతూ ట్విటర్‌లో దాని ఫోటోను షేర్‌చేశాడు. ఎల్లవేళలా మైక్రబ్లాగింగ్‌ సైట్‌లో యాక్టివ్‌గా ఉండే ఆనంద్‌ మహింద్రా వెంటనే ఈ ట్వీట్‌కు సమాధానమిచ్చారు. 

మహింద్రా టీయూవీ 300 వాహనదారి సౌమిత్ర జోషి అనే వ్యక్తి  చేసిన ట్వీట్‌ ఈ విధంగా ఉంది. ‘సర్‌ హ్యాట్సాప్‌. టీయూవీ 300 వాహనం మాకు అందించినందుకు కృతజ్ఞతలు. 4 అడుగుల లోతైన నీటిలో కూడా ఇది డ్రైవ్‌ చేయగలుతుంది’ అని జోషి పేర్కొన్నాడు. ఈ ట్వీట్‌కు వెంటనే స్పందించిన ఆనంద్‌.. ఇది వినడం నిజంగా ఆనందాయకంగా ఉంది. కానీ సురక్షితంగా ఉండండి. ఈ ప్రతికూల పరిస్థితుల్లో కారు లిమిట్స్‌ పరీక్షించడం అంత మంచిది కాదు. ఇది త్రివిధ దళ వాహనం కాదు’ అని సుతిమెత్తగా హెచ్చరించారు. 

మరిన్ని వార్తలు