మేనేజ్డ్‌ కో లొకేషన్‌ సేవలు

10 Apr, 2018 01:09 IST|Sakshi

చిన్న, మధ్య స్థాయి సంస్థలకూ అందించాలి

స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లకు సెబీ ఆదేశాలు

ఆల్గో ట్రేడింగ్‌ నిబంధనలు కఠినతరం  

న్యూఢిల్లీ: చిన్న మధ్య స్థాయి ట్రేడింగ్‌ సభ్యుల అవసరాల కోసం మేనేజ్డ్‌ కో లొకేషన్‌ సేవలు అందించాలని స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లను సెబీ ఆదేశించింది. అలాగే, ఆల్గో ట్రేడింగ్‌ను మరింత బలోపేతం చేసేందుకు వీలుగా కొన్నింటిని ఉచితం చేస్తూ సర్క్యులర్‌ జారీ చేసింది. ప్రజల నుంచి అభిప్రాయాలకు తోడు, సెబీ టెక్నికల్‌ అడ్వైజరీ కమిటీ, సెకండరీ మార్కెట్‌ అడ్వైజరీ కమిటీలను సంప్రదించిన అనంతరం సెబీ తాజా నిర్ణయాలు తీసుకుంది.

‘‘చిన్న, మధ్య స్థాయి ట్రేడింగ్‌ సభ్యులు (బ్రోకరేజీ సంస్థలు) అధిక వ్యయాలు, నిర్వహణలో అనుభవం లేకపోవడం వంటి పలు కారణాలతో కో లొకేషన్‌ సర్వీసులు పొందలేకున్నారు. దీంతో మేనేజ్డ్‌ కొ లొకేషన్‌ సౌకర్యం కింద అర్హులైన వారికి స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లు ప్రత్యేక స్థలాన్ని కేటాయిస్తాయి. ఇక్కడి నుంచి ఆల్గోరిథ్‌మిక్, నాన్‌ ఆల్గోరిథ్‌మిక్‌ ఆర్డర్లను ప్లేస్‌ చేసుకోవచ్చు’’ అని సెబీ తెలిపింది. సాంకేతిక విషయాలైన హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్, ఇతర సేవలకు సంబంధించిన సమాచారం వెండర్లకు అందించడం జరుగుతుందని పేర్కొంది.

మరిన్ని వార్తలు