భారీగా పెరిగిన ఇన్సూరెన్స్‌ కవరేజ్‌

22 Sep, 2018 12:35 IST|Sakshi

న్యూఢిల్లీ : మీ కారుకి ఇన్సూరెన్స్‌ చేయించుకుంటున్నారా? అయితే ఇక నుంచి ఎక్కువ ప్రీమియం చెల్లించాల్సిందే. ప్రీమియం పెంపుతో పాటు కారు యజమానులకు ఎక్కువ మొత్తంలో ఇన్సూరెన్స్‌ కవరేజ్‌ను కూడా లభించనుంది. దేశవ్యాప్తంగా ప్రమాదాల బారిన పడి మరణిస్తున్న వారికి ఆర్థికంగా చేయూతనివ్వడానికి ఐఆర్‌డీఏఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు అందిస్తున్న పర్సనల్‌ యాక్సిడెంట్‌ కవరేజ్‌ను భారీగా రూ.2 లక్షల నుంచి ఏకంగా రూ.15 లక్షలకు పెంచింది. దీని కోసం ఏడాదికి రూ.750 చెల్లించాలని ఐఆర్‌డీఏఐ పేర్కొంది. మద్రాస్‌ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఇన్సూరెన్స్‌ రెగ్యులేటరీ ఈ ఆదేశాలను జారీ చేసింది. 

కొత్త నిబంధన ప్రకారం, పర్సనల్‌ వెహికిల్‌ ఇన్సూరర్స్‌ ఇక నుంచి కనీసం రూ.15 లక్షల యాక్సిడెంట్‌ కవరేజ్‌ అందించాల్సిందేనని ఐఆర్‌డీఏఐ పేర్కొంది. దీనికి ప్రీమియం ఏడాదికి 750 రూపాయలుగా నిర్ణయించింది. ఇప్పటి వరకు పర్సనల్‌ యాక్సిడెంట్‌ కవరేజ్‌ టూ-వీలర్స్‌కు లక్ష రూపాయలు, కమర్షియల్‌ వెహికిల్స్‌కు రూ.2 లక్షలుగా ఉంది. దీనికి నెలవారీ ప్రీమియం టూ-వీలర్స్‌కు 50 రూపాయలు, కమర్షియల్‌ వెహికిల్స్‌కు 100 రూపాయలు. పర్సనల్‌ యాక్సిడెంట్‌ కవరేజ్‌ సహ-ప్రయాణికులకు కూడా అందుబాటులో ఉంది. అయితే తాజా పెంపుతో అదనపు కవర్‌ అందించేందుకు అదనపు ప్రీమియం చెల్లించాల్సి ఉంది. తదుపరి నోటిసు జారీ చేసేంతవరకు ఈ రేట్లు అమలులో ఉంటాయని ఐఆర్‌డీఏఐ ప్రత్యేక సర్క్యూలర్‌ను జారీచేసింది. 

పర్సనల్‌ యాక్సిడెంట్‌ పాలసీ కేవలం మరణించిన ప్రయాణికుల కుటుంబాలకు మాత్రమే కాక, ఎవరైనా వైకల్యం చెందినా వర్తించనుంది. పర్సనల్‌ యాక్సిడెంట్‌ కవరేజ్‌ పెంపు అన్ని మోటార్‌ ఇన్సూరెన్స్‌ పాలసీలకు వర్తిస్తుంది.  ఐఆర్‌డీఏఐ తీసుకున్న ఈ తాజా నిర్ణయంపై బజాజ్ అలయెంజ్ జనరల్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈవో తపన్ సింఘాల్ మాట్లాడుతూ..సీపీఏ కింద యజమాని-డ్రైవర్‌కు రూ.15 లక్షల వరకు బీమా కల్పించడం సరైన నిర్ణయమన్నారు. వ్యక్తిగత ప్రమాద బీమాతో ప్రమాదం జరిగినప్పుడు పాలసీదారుడికి, ఆయన కుటుంబ సభ్యులకు ఆర్థికంగా లబ్దిచేకూరనున్నదన్నారు. ఇలాంటి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు, మ సంస్థ త్వరలో నూతన పాలసీని ప్రకటించే అవకాశం ఉందన్నారు. 

మరిన్ని వార్తలు