ధరలు పైకి.. పరిశ్రమలు డీలా!

13 Sep, 2017 01:11 IST|Sakshi
ధరలు పైకి.. పరిశ్రమలు డీలా!

ఆర్థిక గణాంకాలు నిరుత్సాహం
► జూలైలో పారిశ్రామిక వృద్ధి 1.2 శాతం
► ఆగస్టులో ఐదు నెలల గరిష్టానికి రిటైల్‌ ధరలు...  


న్యూఢిల్లీ: భారత్‌ ఆర్థిక గణాంకాలు ఇంకా నిరుత్సాహంగానే కొనసాగుతున్నట్లు మంగళవారం వెలువడిన గణాంకాలు స్పష్టంచేశాయి. 2017 జూలై పారిశ్రామిక ఉత్పత్తి (ఐఐపీ) వృద్ధి రేటు కేవలం 1.2 శాతంగా నమోదయింది. గత ఏడాది ఇదే నెల్లో ఈ వృద్ధి రేటు 4.5 శాతం. ఇక ఏప్రిల్‌–జూలై మధ్య కాలంలో ఐఐపీ వృద్ధి రేటు గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 6.5 శాతం నుంచి 1.7 శాతానికి పడిపోయింది. మరోవైపు ఆగస్టు నెల్లో రిటైల్‌ ధరల స్పీడ్‌ 3.36 శాతంగా (గత ఏడాది ఇదే నెలలో ధరలతో పోల్చి) నమోదయింది. గడచిన ఐదు నెలల్లో ఈ స్థాయిలో రిటైల్‌ ద్రవ్యోల్బణం నమోదుకావడం ఇదే తొలిసారి.

తయారీ పేలవ పనితీరు...
మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి సూచీలో దాదాపు 77 శాతంగా ఉన్న తయారీ రంగం జూలైలో పేలవ పనితీరును ప్రదర్శించింది. 2016 జూలైలో తయారీ రంగం 5.3 శాతం వృద్ధిని నమోదుచేసుకుంటే, 2017 జూలైలో అసలు వృద్ధిలేకపోగా –0.1 శాతం క్షీణించింది. ఏప్రిల్‌ నుంచి జూలై మధ్య నెలలను చూస్తే వృద్ధి రేటు 6.3 శాతం నుంచి 1.3 శాతానికి పడింది. తయారీ రంగంలోని మొత్తం 23 పారిశ్రామిక గ్రూపుల్లో ఎనిమిది మాత్రమే వృద్ధిని నమోదుచేసుకున్నాయి.

♦ క్యాపిటల్‌ గూడ్స్‌: భారీ యంత్ర ఉత్పత్తి, డిమాండ్‌ వృద్ధికి ప్రతిబింబమైన ఈ విభాగంలోనూ 8.8 శాతం వృద్ధి రేటు (2016 జూలై) –1 శాతం క్షీణతలోకి జారింది.
♦ కన్జూమర్‌ డ్యూరబుల్స్‌: ఈ విభాగంలో 0.2 శాతం వృద్ధి ఈ దఫా ఏకంగా –1.3 శాతం క్షీణతలోకి జారింది. అయితే కన్జూమర్‌–నాన్‌–డ్యూరబుల్స్‌ విషయంలో వృద్ధి రేటు 3.4 శాతానికి ఎగసింది.
♦ విద్యుత్‌: ఈ రంగం మాత్రం చక్కని పనితీరును ప్రదర్శించింది. వృద్ధిరేటు 2.1% నుంచి 6.5%కి చేరింది. అయితే ఆర్థిక సంవత్సరం నాలుగు నెలల కాలంలో మాత్రం ఈ రేటు 7.9% నుంచి 5.6%కి తగ్గింది.
♦ మైనింగ్‌: ఈ రంగం కూడా సానుకూల రీతిలో 0.9 శాతం వృద్ధిరేటు 4.8 శాతానికి పెరిగింది. అయితే ఏప్రిల్‌ నుంచి జూలై మధ్య నెలల్లో చూస్తే వృద్ధి రేటు 5.8 శాతం నుంచి 2.1 శాతానికి పడింది.
మరోవైపు జూన్‌లో వృద్ధి లేకపోగా – 0.2 శాతం క్షీణత నమోదయ్యిందని సవరించిన గణాంకాలు వెల్లడించాయి.

రాష్ట్ర స్థాయిల్లో సంస్కరణలు: ఫిక్కీ
పారిశ్రామిక ఉత్పత్తి పేలవ పనితీరుపై పారిశ్రామిక ప్రాతినిధ్య మండలి ఫిక్కీ సెక్రటరీ జనరల్‌ సంజయ్‌ బారు మాట్లాడుతూ, దేశంలో పెట్టుబడుల పునరుద్ధరణ తక్షణం అవసరమన్నారు. ఇందుకు వడ్డీరేట్ల తగ్గింపు, ఈ ప్రయోజనం పెట్టుబడిదారులకు అందేలా చేయడం కీలకమని వివరించారు. దీనితోపాటు రాష్ట్రస్థాయిలో సంస్కరణలూ ముఖ్యమని వివరించారు. కాగా, భారత్‌ 9 నుంచి 10 శాతం భారీ వృద్ధిని సాధించడానికి తొలుత తయారీ రంగం పురోగమించాల్సి ఉందని అసోచామ్‌–ఈవై నిర్వహించిన ఒక అధ్యయనం పేర్కొంది. తయారీ రంగం వచ్చే 30 సంవత్సరాలూ స్థిరంగా 14 నుంచి 15 శాతం మేర సగటు వార్షిక వృద్ధిని సాధించాల్సిన అవసరం ఉందని వివరించింది.

పెరుగుతున్న రిటైల్‌ ధరలు
మరోవైపు రిటైల్‌ ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. మార్చి నుంచి తగ్గుతూ జూన్‌ నాటికి 1.46 శాతానికి తగ్గిన రిటైల్‌ ద్రవ్యోల్బణం స్పీడ్‌ మళ్లీ పెరుగుతూ జూలైలో 2.36 శాతానికి చేరింది. తాజాగా వెలువడిన గణాంకాల ప్రకారం ఇది ఆగస్టు నెలలో 3.36 శాతం. అంటే  2016 రిటైల్‌ బాస్కెట్‌ ధరతో పోల్చితే ప్రస్తుత ఏడాది ఆగస్టు రిటైల్‌ బాస్కెట్‌ ధర 3.36 శాతం పెరిగిందన్నమాట. ఇది ఐదు నెలల గరిష్ట స్థాయి. పండ్లు, కూరగాయల ధరల పెరుగుదల దీనికి ప్రధాన కారణం.

నిత్యావసరాలు ఇలా: ధరలు పెరిగిన జాబితాలో కూరగాయలు (6.16 శాతం), పండ్లు (5.29 శాతం), చక్కెర (7.35 శాతం), పాలు, పాలపదార్థాలు (3.58 శాతం) ప్రెపేర్డ్‌ మీల్స్‌ (5.23%), మాంసం చేపలు (3 శాతం) వంటివి ఉన్నాయి.

మరిన్ని వార్తలు