ఒక్క రోజులోనే కోటీశ్వరులయ్యారు

7 Aug, 2018 11:16 IST|Sakshi
కోటీశ్వరులైన హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ ఉద్యోగులు (ప్రతీకాత్మక చిత్రం)

ముంబై : హెచ్‌డీఎఫ్‌సీ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ(ఏఎంసీ) సోమవారం లిస్టింగ్‌లో మెరుపులు మెరిపించిన సంగతి తెలిసిందే. ఇష్యూ ధర, రూ.1,100తో పోల్చితే 58 శాతం లాభంతో బీఎస్‌ఈలో రూ.1,738 వద్ద లిస్టయింది. ఇంట్రాడేలో 68 శాతం లాభంతో రూ.1,843 వద్ద గరిష్ట స్థాయిని తాకింది. చివరకు 65 శాతం లాభంతో రూ.1,815 వద్ద ముగిసింది. ఈ బంపర్‌ లిస్టింగ్‌తో కంపెనీ కీలక ఉద్యోగులందరూ ఒక్క రోజులోనే కోటీశ్వరులయ్యారు. ప్రస్తుత ధర వద్ద కంపెనీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ మిలిండ్‌ బార్వే వాటా విలువ రూ.188 కోట్లకు చేరింది. చీఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఆఫీసర్‌ ప్రశాంత్‌ జైన్‌ షేర్ల విలువ రూ.161 కోట్లకు ఎగిసింది. కేవలం వారిద్దరివే కాక, మరికొంత మంది కీలక ఉద్యోగుల సంపద కూడా కోట్లలోకి ఎగబాకింది.

కోటీశ్వరులైన హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ ఉద్యోగులు...(పిక్చర్‌ సోర్స్‌ : ఎకనామిక్‌ టైమ్స్‌)

తొలిసారి పబ్లిక్‌ ఆఫర్‌కు వచ్చిన  హెచ్‌డీఎఫ్‌సీ అసెట్‌ మేనేజ్‌మెంట్‌, ఆ ఆఫర్‌ జూలై 27తో క్లోజైంది. ఆ ఆఫర్‌లో కంపెనీ రూ.2,800 కోట్లను సంపాదించింది. రూ.1.71 లక్షల కోట్ల​ విలువైన బిడ్స్‌ను కూడా సొంతం చేసుకుంది. ఇటీవల స్టాక్‌ మార్కెట్‌లో లిస్టింగ్‌ వచ్చిన ఐపీఓలన్నీ బంపర్‌ జోష్‌తో దూసుకుపోతున్నాయి. వాటిలో పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్ల సంపద కూడా అదే స్థాయిల్లో ఎగుస్తోంది. డీమార్ట్‌లు నిర్వహించే అవెన్యూ సూపర్‌మార్ట్స్‌, ఆస్ట్రాన్‌ పేపర్‌, సాలసార్‌ టెక్నాలజీ ఐపీఓలు లిస్టింగ్‌లలో అదరగొట్టాయి. హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ ఎక్కువగా లాభాలు ఆర్జించే ఫండ్‌ హౌజ్‌. 2018 మార్చి చివరి నాటికి ఈ కంపెనీ రూ.722 కోట్ల లాభాలను ఆర్జించింది. ఇది అతిపెద్ద అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ కూడా. 

ఇక స్టాక్‌ మార్కెట్లో లిస్టైన రెండో మ్యూచువల్‌ ఫండ్‌ కంపెనీగా హెచ్‌డీఎఫ్‌సీ ఏఎమ్‌సీ అవతరించింది. గత ఏడాది రిలయన్స్‌ నిప్పన్‌ లైఫ్‌ ఏఎమ్‌సీ స్టాక్‌ మార్కెట్లో లిస్టయింది. ఈ ఏడాది అత్యధిక లాభంతో లిస్టైన రెండో ఐపీఓగా హెచ్‌డీఎఫ్‌సీ ఏఎమ్‌సీ నిలిచింది. అపోలో మైక్రో సిస్టమ్స్‌ ఈ ఏడాది జనవరి 22న 74 శాతం లాభంతో స్టాక్‌ మార్కెట్లో లిస్టయింది. కాగా 2011 తర్వాత అత్యధిక లిస్టింగ్‌ లాభాలు సాధించిన ఆరో కంపెనీ ఇది. 

మరిన్ని వార్తలు